Telangana News: రామగుండం బొగ్గు గనిలో ప్రమాదం.. కొనసాగుతోన్న సహాయక చర్యలు

పెద్దపల్లి జిల్లా రామగుండం-3 పరిధిలోని అడ్రియాల్‌ లాంగ్‌వాల్ ప్రాజెక్టులో సోమవారం మధ్యాహ్నం సైడు పైకప్పు కూలడంతో ఒక అధికారి సహా నలుగురు కార్మికులు చిక్కుకుపోయిన

Updated : 08 Mar 2022 17:00 IST

గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా రామగుండం-3 పరిధిలోని అడ్రియాల్‌ లాంగ్‌వాల్ ప్రాజెక్టులో సోమవారం మధ్యాహ్నం సైడు పైకప్పు కూలడంతో ఒక అధికారి సహా నలుగురు కార్మికులు చిక్కుకుపోయిన ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక చర్యలు కొనసాగిస్తోన్న రెస్క్యూ టీం ఇప్పటివరకు ముగ్గరు కార్మికులను బయటకు తీసుకురాగలిగారు. గనిలో చిక్కుకుపోయిన సపోర్టుమెన్‌ వీరయ్య, నరేశ్‌, వెంకటేశ్వర్లును సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. సింగరేణి డైరెక్టర్లు బలరాం, చంద్రశేఖర్, సత్యనారాయణలు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. కొద్దిసేపటి క్రితం శిథిలాల నుంచి బయటపడ్డ బదిలీ వర్కర్‌ రవీందర్‌ మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది.

ప్రమాద స్థలికి ఆక్సిజన్ సిలిండర్లు, మెడికల్ కిట్లను పంపిస్తూ సహాయక చర్యలను మరింత ముమ్మరం చేశారు. ప్రస్తుతం గని అసిస్టెంట్‌ మేనేజర్‌ చైతన్య తేజ, ఒప్పంద కార్మికుడు తోట శ్రీకాంత్‌, మరో కార్మికుడి ఆచూకీ కోసం రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు ముమ్మరం చేశారు. యంత్రాలను వాడకుండా శిథిలాలు తొలగిస్తున్నందున సహాయ చర్యల్లో ఆలస్యం జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. యంత్రాలు వాడితే శిథిలాల్లో చిక్కుకుపోయి కార్మికులు గాయపడే అవకాశం ఉన్నందున అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరోవైపు ప్రమాదం జరిగి 24 గంటలు గడిచినా స్పష్టమైన సమాచారం లేదని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని