Cyber fraud: మరో కొత్త రకం స్కామ్.. అడ్వర్టైజ్‌మెంట్‌ పేరుతో ₹81 లక్షలకు టోకరా!

Cyber fraud: అడ్వర్టైజ్‌మెంట్‌ పేరు చెప్పి ఓ విశ్రాంత ఉద్యోగి నుంచి రూ.81 లక్షలు కాజేశారు సైబర్‌ నేరగాళ్లు. ఆ వివరాలు ఇవీ..

Published : 17 Jun 2024 16:05 IST

Cyber fraud | ఇంటర్నెట్‌ డెస్క్: అమయాకుల నుంచి డబ్బులు కొట్టేసేందుకు సైబర్‌ నేరగాళ్లు (Cyber fraudsters) కొత్త కొత్త పంథాల్ని అనుసరిస్తున్నారు. ఒకతరహా స్కామ్ గురించి ప్రజల్లో అవగాహన రాగానే.. మరో కొత్త మార్గాన్ని అన్వేషిస్తున్నారు. అలా ఇప్పుడు కొత్తగా అడ్వర్టైజ్‌మెంట్‌ మోసం ఒకటి వెలుగులోకి వచ్చింది. అలా పుణెకు చెందిన ఓ రిటైర్డ్‌ ఉద్యోగి నుంచి ఏకంగా రూ.81 లక్షలు కాజేశారు సైబర్‌ నేరగాళ్లు.

కెమికల్‌ ఇంజినీర్‌గా పనిచేసి రిటైర్‌ అయిన ఓ వ్యక్తికి మే నెల మూడో వారంలో గుర్తుతెలియని నంబర్‌ నుంచి కాల్ వచ్చింది. ‘‘మీ పేరుతో చట్ట విరుద్ధంగా అభ్యంతరకరమైన ప్రకటన వచ్చింది. దీనిపై ఇప్పటికే 24 ఫిర్యాదులు వచ్చాయి. మీ మీద ముంబయిలోని ఫోర్ట్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది’’ అంటూ అవతలి వ్యక్తి చెప్పాడు. బాధితుడిని మరింత నమ్మించేందుకు కాసేపటికే ఇన్‌స్పెక్టర్‌ పేరుతో మరో వ్యక్తి కాల్‌ చేశాడు. మనీలాండరింగ్‌ కార్యకలాపాలకు సంబంధించిన ఆరోపణలు కూడా ఉన్నాయని మరింత భయపెట్టాడు. ఈ వ్యవహారంలో ముంబయి సీబీఐ చీఫ్‌తో మాట్లాడి సమస్య పరిష్కరించుకోండంటూ సలహా ఇచ్చాడు.

కరెంటు షాక్‌ ఇచ్చి.. దర్శన్‌ అభిమాని హత్య కేసులో విస్తుపోయే వాస్తవాలు

మరికాసేపటికి ఓ వీడియో కాల్‌. ప్రొఫైల్‌ పిక్‌గా పోలీస్‌ లోగో. అప్పటికే తీవ్ర భయాందోళనలో ఉన్న రిటైర్డ్‌ ఉద్యోగికి సీబీఐ ఆఫీసర్‌ అంటూ ఓ వ్యక్తి దర్శనమిచ్చాడు. అనైతిక, మనీలాండరింగ్‌ ఆరోపణల నేపథ్యంలో ఆస్తులను ఫ్రీజ్‌ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలున్నాయంటూ మరింత ఆందోళనకు గురిచేశాడు. కోర్టు పేరు చెప్పడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. తాను ఏ తప్పూ చేయలేదని చెప్పినా.. అవతలి వ్యక్తి దబాయించడం మొదలుపెట్టాడు.

బాధితుడు ఏం చెప్పినా వింటాడనే స్టేజ్‌కు వచ్చాక.. సీబీఐ ఆఫీసర్‌ ముసుగులో ఉన్న సైబర్‌ నేరగాడు వ్యక్తిగత వివరాలు ఆరాతీయడం మొదలుపెట్టాడు. బ్యాంకు బ్యాలెన్స్‌ వివరాలు తెలుసుకున్నాడు. తర్వాత రూ.60 లక్షలు, రూ.21 లక్షలు చొప్పున రెండుసార్లు సెక్యూరిటీ డిపాజిట్‌ పేరిట వసూలు చేశాడు. ఇంకా డబ్బులు డిమాండ్‌ చేయడంతో బాధితుడికి అనుమానం వచ్చి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ‘పార్శిల్స్‌’ స్కామ్‌ తరహాలోనే ఈ వృద్ధుడి నుంచి డబ్బులు వసూలుచేసినట్లు అక్కడి పోలీసులు గుర్తించారు. అతడిచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఈతరహా ఫేక్‌ కాల్స్‌కు స్పందించొద్దని ప్రజలకు పోలీసులు సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని