గోవా నుంచి హైదరాబాద్‌ వస్తున్న బస్సులో మంటలు.. 8 మంది సజీవదహనం!

కర్ణాటకలో ఘోర ప్రమాదం జరిగింది. కలబురి జిల్లా కమలాపురలో

Updated : 03 Jun 2022 17:06 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కర్ణాటకలో ఘోర విషాదం చోటుచేసుకుంది. కలబురిగి జిల్లా కమలాపురలో  గూడ్స్‌ లారీని ఆరెంజ్‌ ట్రావెల్స్‌కు చెందిన స్లీపర్‌ బస్సు బలంగా ఢీకొట్టి పక్కనే ఉన్న ఓ గుంతలో బోల్తా పడింది. ఈ  క్రమంలో మంటలు చెలరేగడంతో నిమిషాల వ్యవధిలో బస్సు కాలిపోయింది.  ఈ ఘటనలో 8 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మరో 27 మంది గాయపడ్డారు. మృతుల్లో హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అర్జున్‌కుమార్‌ (37), అతని భార్య (32), బివాన్‌ (4), దీక్షిత్‌ (9), అనితా రాజు (40), శివకుమార్‌ (35), రవళి (30)తో పాటు మరొకరు ఉన్నారు. మృతులు, క్షతగాత్రులను హైదరాబాద్‌ బొల్లారంలోని రిసాలబజార్‌కు చెందిన వారిగా గుర్తించారు.

పుట్టినరోజు వేడుకల కోసం రెండు కుటుంబాలకు చెందిన 32 మంది గోవాకు వెళ్లారు. వీరిలో 21 మంది ఓ కుటుంబం.. 11 మంది మరో కుటుంబం. తిరుగు ప్రయాణంలో బస్సు గోవా నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా శ్రీరంగపట్నం-బీదర్‌ హైవేపై ఈ ఘోర దుర్ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో డ్రైవర్‌, ఇద్దరు సహాయకులు సహా మొత్తం 35 మంది ప్రయాణికులు ఉన్నారు. క్షతగాత్రులను స్థానికులు రక్షించి కలబురిగి పరిధిలోని మూడు ప్రైవేట్‌ ఆస్పత్రులకు తరలించారు. 

బాధితులకు ఆర్థిక సాయం ప్రకటించిన సీఎం కేసీఆర్‌

కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరి రూ.3లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలని, గాయపడిన వారికి రూ.50వేల చొప్పున పరిహారం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.  




Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని