మేడారం జాతరకు వెళ్లే మార్గంలో రోడ్డు ప్రమాదం.. నలుగురి దుర్మరణం

ములుగు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. మేడారం జాతరకు వెళ్లే మార్గంలో ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్నాయి.

Updated : 19 Feb 2022 14:58 IST

ములుగు: ములుగు జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మేడారం జాతరకు వెళ్లే మార్గంలో ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో కారులోని నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మేడారం జాతరకు వెళ్లేందుకు ఎంట్రీ పాయింట్‌గా భావించే గట్టమ్మ ఆలయ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జునుజ్జుకాగా.. మృతదేహాలు కారులో ఇరుక్కుపోయాయి. అతికష్టం మీద మృతదేహాలను బయటకి తీశారు. బస్సు ముందు భాగం కూడా కొంత దెబ్బతింది.

మేడారం జాతరకు  వెళ్లే మార్గం కావడంతో కొద్దిసేపటిలోనే ఆ మార్గంలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు క్రేన్‌ సహాయంతో కారును రోడ్డు పక్కకు తరలించి.. ఆ మార్గంలో రాకపోకలను పునరుద్ధరించారు. మృతులను ములుగు జిల్లా వాజేడు మండలం చంద్రుపట్ల(జడ్‌) వాసులుగా గుర్తించారు. రమేశ్‌ (45), జ్యోతి(42), శ్రీనివాస్‌(42), సుజాత.. నెక్కొండ మండలానికి పెళ్లి సంబంధం మాట్లాడేందుకు కారులో బయలు దేరారు. ఈ క్రమంలో గట్టమ్మ ఆలయ సమీపంలోకి రాగానే మేడారం వైపు వెళ్తున్న హన్మకొండ డిపో బస్సు ఎదురుగా వచ్చి కారును బలంగా ఢీ కొట్టింది. ప్రమాదంలో రమేశ్‌, జ్యోతి, శ్రీనివాస్‌, కారు డ్రైవర్‌ కల్యాణ్‌(28) అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన సుజాతను వరంగల్‌ ఎమ్‌జీఎమ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎమ్‌జీఎమ్‌కు తరలించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని