Ap News: నలుగురిని చిదిమేసిన లారీ

నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గూడూరు-మనుబోలు మధ్య జాతీయ రహదారిపై లారీని కారు ఢీకొట్టింది. తిరుమల శ్రీవారిని దర్శించుకొని కాకినాడు తిరిగి వెళ్తుండగా.. గూడూరు-మనుబోలు

Updated : 05 Jul 2021 06:13 IST

గూడూరు గ్రామీణం, మనుబోలు: దైవదర్శనానికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఈ విషాదకర ఘటన నెల్లూరు జిల్లా మనుబోలు-గూడూరు సరిహద్దు ప్రాంతంలోని చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా పెదపూడి మండలం సంపర గ్రామానికి చెందిన మాజీ సర్పంచి తిబిరిశెట్టి వీరన్న అలియాస్‌ దొరబాబు(55), ఆయన భార్య శ్రీవరలక్ష్మి(48), కుమార్తె లిఖిత కాకినాడలోని జగన్నాథపురంలో నివాసముంటున్నారు. తిరుమలకు వెళ్లేందుకు సమీప బంధువులు మణికంఠ(37), ఆయన భార్య స్వాతి(32)తో కలిసి కారులో తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు.  ఆదివారం తిరుగు ప్రయాణమయ్యారు.

అప్పటికే మనుబోలు-గూడూరు సరిహద్దు ప్రాంతం వద్ద వంతెన నిర్మాణ పనులు జరుగుతుండటంతో స్పీడ్‌ బ్రేకర్లను వేశారు. వేగాన్ని నియంత్రించే క్రమంలో ముందు వెళ్తున్న లారీ డ్రైవర్‌ ఒక్కసారిగా బ్రేక్‌ వేశాడు. ఈ క్రమంలో లారీ వెనక ఉన్న కారు కూడా నిలిచిపోయింది. అదే సమయంలో అతి వేగంగా వస్తున్న మరో లారీ ఆగి ఉన్న కారును వెనుక నుంచి వేగంగా ఢీకొనడంతో రెండు లారీల మధ్య కారు నుజ్జునుజ్జు అయింది. కారులో ఉన్న మణికంఠ, వీరన్న, శ్రీవరలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ఇరుక్కుపోయిన స్వాతి, లిఖితను భారీ యంత్రాల సాయంతో బయటకు తీశారు. ఇద్దరినీ 108 వాహనంలో నెల్లూరుకు తరలించే క్రమంలో మార్గమధ్యంలో స్వాతి మృతిచెందగా.. లిఖిత నెల్లూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతుంది. లారీ డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత రహదారిపై కాసేపు ట్రాఫిక్‌ నిలిచిపోయింది. మనుబోలు, చిల్లకూరు, గూడూరు గ్రామీణం, పట్టణ ఎస్సైలు ఘటనాస్థలికి చేరుకుని ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. గూడూరు గ్రామీణ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసరెడ్డి ఘటనాస్థలికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. కారులో ఇరుక్కున్న మృతదేహాలను క్రేన్, జేసీబీ సాయంతో అతికష్టం మీద బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు