కూలీలపైకి దూసుకెళ్లిన లారీ..15 మంది మృతి

గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వస్తున్న లారీ ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ తప్పించబోయి అదుపు తప్పి పాదచారుల బాటపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 13 మంది మృతిచెందారు.......

Updated : 19 Jan 2021 11:22 IST

 

సూరత్‌: రాత్రి పనిచేసుకొని బతికే ఆ కూలీల బతుకులు నిద్రలోనే తెల్లారిపోయాయి. పొట్టకూటి కోసం పాదచారుల బాటనే నివాసంగా చేసుకున్న వారి జీవితాలకు అదే చివరి మజిలీ అయింది. రాళ్లుకొట్టి అలసిన వారు.. ఓ లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యంతో శాశ్వత విశ్రాంతిలోకి జారుకున్నారు. తమపై ఆధారపడిన కుటుంబాలకు తీరని శోకం మిగిల్చి వెళ్లారు. వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌లోని సూరత్‌ జిల్లా కోసంబి పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 15 మంది మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సూరత్‌కు తరలించి చికిత్స అందజేస్తున్నారు. వీరంతా రాజస్థాన్‌లోని బాన్స్‌వాడా జిల్లాకు చెందినవారిగా గుర్తించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం-మంగళవారం మధ్య రాత్రి 12:30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. కోసంబిలోని ఓ ప్రధాన కూడలి నుంచి మాండ్వివైపు లారీ వేగంగా వెళుతోంది. ఈ క్రమంలో ఎదురుగా చెరకు లోడ్‌తో వస్తున్న ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. దీంతో డ్రైవర్‌ నియంత్రణ కోల్పోయి ఫుట్‌పాత్‌వైపు మళ్లించాడు. దీంతో అక్కడే నిద్రిస్తున్న 18 మంది కార్మికులపై నుంచి లారీ దూసుకెళ్లింది. వీరిలో 12 మంది అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఇంకా ముగ్గురికి వైద్యసాయం కొనసాగుతోంది. ఈ ఘటనలో తొమ్మిది నెలల చిన్నారి సురక్షితంగా బయటపడగా.. ఆమె తల్లిదండ్రులు మృతిచెందడం విషాదకరం.

ఇవీ చదవండి...

హైదరాబాద్‌ కేపీహెచ్‌బీలో దారుణం

తనయుడిని కాపాడబోయి.. తండ్రి దుర్మరణం


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని