Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 18 మంది దుర్మరణం

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకొంది. ఉన్నావ్‌ వద్ద పాల ట్యాంకర్‌ను డబుల్‌ డెక్కర్‌ బస్సు ఢీకొన్న ఘటనలో 18 మంది మృతి చెందారు.

Updated : 10 Jul 2024 10:01 IST

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకొంది. ఉన్నావ్‌ వద్ద పాల ట్యాంకర్‌ను డబుల్‌ డెక్కర్‌ బస్సు ఢీకొన్న ఘటనలో 18 మంది మృతి చెందగా, 19 మంది గాయపడ్డారు. ఉదయం 5.15 గంటలకు లఖ్‌నవూ- ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..  డబుల్‌ డెక్కర్‌ బస్సు బిహార్‌ నుంచి దిల్లీకి వెళ్తున్నట్లు గుర్తించారు. ఉన్నావ్‌ సమీపంలో పాల ట్యాంకర్‌ను వెనక  నుంచి వచ్చి ఢీకొట్టింది. దాంతో బస్సు ముందుభాగం ధ్వంసమైంది. అతివేగం కారణంగా బస్సులోని వారు బయటకు ఎగిరిపడ్డారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, అత్యవసర సిబ్బంది ఘటనాస్థలిలో సహాయక చర్యలు చేపట్టారు. 

ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని, అతివేగమే కారణమని ప్రాథమికంగా గుర్తించినట్లు పోలీసులు చెప్పారు. ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అలాగే గాయపడినవారికి తగిన వైద్య చికిత్స అందేలా చూడాలని అధికారుల్ని ఆదేశించారు. క్షతగాత్రులకు బగార్‌మావ్‌ సీహెచ్‌సీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని