Road Accident: తెలుగు రాష్ట్రాల్లో.. ఆరు వేర్వేరు ప్రమాదాల్లో 13 మంది దుర్మరణం

తెలుగు రాష్ట్రాల్లో ఈ ఉదయం రహదారులు నెత్తురోడాయి. ఆరు వేర్వేరు ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు.

Updated : 22 May 2022 10:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెలుగు రాష్ట్రాల్లో ఈ ఉదయం రహదారులు నెత్తురోడాయి. ఆరు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆయా ప్రాంతాల్లో ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

వరంగల్‌లోని ఖమ్మం బైపాస్‌ హంటర్‌ రోడ్డు ఫ్లైఓవర్‌ నుంచి కారు కిందపడింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా.. ఎంజీఎంలో చికిత్స పొందుతూ మరొకరు చనిపోయారు. మృతిచెందిన వారిని ప్రభుత్వ ఉద్యోగి సారయ్య(42), ఆయన భార్య సుజాత(39)గా గుర్తించారు. ఖమ్మం నుంచి వరంగల్‌ వైపు వస్తున్న కారు ఫ్లైఓవర్‌ మీద మరో కారును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో గాయపడిన మరో ఇద్దరూ ఎంజీఎంలో చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. 

బొగ్గు లారీ ఢీకొట్టి..

భద్రాద్రి జిల్లా టేకులపల్లి మండలంలోని దాసుతండా సమీపంలో ఆదివారం తెల్లవారుజామున బైక్‌ను వెనుకవైపు నుంచి వచ్చిన బొగ్గు టిప్పర్‌ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మృతులను మండలంలోని ఎర్రాయిగూడెంకి చెందిన ఈసం హనుమంతు (34), ఈసం స్వామి (42)గా గుర్తించారు. వీరిద్దరూ పెళ్లిలో భాజా మోగించి.. బైక్‌పై స్వగ్రామానికి తిరుగుపయనమయ్యారు. ఈ క్రమంలో దాసుతండా దాటగానే వెనుకాల నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీ కొట్టింది. హనుమంత్ అక్కడికక్కడే మృతి చెందగా.. ఆస్పత్రికి తరలిస్తుండగా స్వామి చనిపోయాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టేకులపల్లి ఎస్‌ఐ శ్రీనివాస్ తెలిపారు.

మృతదేహాలు మూడు గంటలు రోడ్డుపైనే..

ఖిలా వరంగల్ మండలం బొల్లికుంట వద్ద ఈ తెల్లవారుజామున గుర్తు తెలియని వాహనం ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న ఇద్దరు మహిళలతో పాటు డ్రైవర్‌ అక్కడికక్కడే మృతిచెందారు. ఆటో డ్రైవర్‌ను తిమ్మాపూర్‌కు చెందిన బబ్లూగా గుర్తించారు. మృత దేహాలను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఘటన గురించి అంబులెన్స్‌ సిబ్బందికి ఎవరూ సమాచారం ఇవ్వకపోవడంతో మృతదేహాలు సుమారు మూడు గంటల పాటు రోడ్డుపైనే ఉన్నాయి. అనంతరం పోలీసులకు సమాచారం అందడంతో వారు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాలను వరంగల్‌ ఎంజీఎంకు తరలించారు.

మేడ్చల్‌లో డీసీఎం క్లీనర్‌ మృతి..

మేడ్చల్‌ జిల్లా సూరారంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బహదూర్‌ పల్లి నుంచి సూరారం వైపు వస్తున్న డీసీఎం.. కాలనీ నుంచి రోడ్డు పైకి వస్తున్న ఓ లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో డీసీఎం ముందు భాగం నుజ్జునుజ్జవ్వగా క్లీనర్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న దుండిగల్‌ పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

వైఎస్‌ఆర్‌ జిల్లాలో ఆగి ఉన్న లారీని ఢీకొట్టి..

వైఎస్‌ఆర్‌ జిల్లా మైలవరం మండలం తాడిపత్రి బైపాస్‌ రోడ్డులో ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలతో సహా ముగ్గురు మృతిచెందారు. ప్రమాదంలో చిన్నారికి, డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని జమ్మలమడుగు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

అన్నమయ్య జిల్లాలో..

అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం గుట్టపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బైకులు ఢీకొని ఇద్దరు మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. మృతులు కలకడ మండల వాసులు సోమశేఖర్‌(18), జ్యోతి నాయుడు(19)గా గుర్తించారు. గుట్టపల్లి ఆంజనేయస్వామి తిరునాళ్లకు వచ్చి కలకడ తిరిగి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని