Robbery: అర్ధరాత్రి రెండు రైళ్లలో దోపిడీ

మచిలీపట్నం నుంచి బీదర్‌ వెళ్తున్న బీదర్‌ ఎక్స్‌ప్రెస్, తిరుపతి నుంచి సికింద్రాబాద్‌ వెళ్తున్న పద్మావతి ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో బుధవారం అర్ధరాత్రి సమయంలో దోపిడీలు జరిగాయి.

Updated : 14 Jun 2024 06:47 IST

 ఖమ్మం జిల్లా చింతకాని వద్ద ఘటనలు

ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న రైల్వే ఎస్పీ సలీమా, వైరా ఏసీపీ రెహ్మాన్‌

చింతకాని, రెజిమెంటల్‌బజార్, న్యూస్‌టుడే: మచిలీపట్నం నుంచి బీదర్‌ వెళ్తున్న బీదర్‌ ఎక్స్‌ప్రెస్, తిరుపతి నుంచి సికింద్రాబాద్‌ వెళ్తున్న పద్మావతి ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో బుధవారం అర్ధరాత్రి సమయంలో దోపిడీలు జరిగాయి. ఖమ్మం జిల్లా చింతకాని సమీపంలో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. దుండగులు నాగులవంచ-చింతకాని మధ్య ఉన్న సిగ్నలింగ్‌ వ్యవస్థను ట్యాంపరింగ్‌ చేసి ఆయా రైళ్లను ఆపినట్లు రైల్వే పోలీసులు అనుమానిస్తున్నారు. మొదట బుధవారం అర్ధరాత్రి 12 గంటల అనంతరం వచ్చిన బీదర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును ఆపి నాలుగు రిజర్వేషన్‌ బోగీల్లోకి చొరబడ్డారు. కొద్దిసేపటి తర్వాత గ్రీన్‌సిగ్నల్‌ పడటంతో ఆ రైలు యథావిధిగా ముందుకు వెళ్లింది. రాత్రి ఒంటిగంట సమీపంలో అదే మార్గంలో వచ్చిన పద్మావతీ ఎక్స్‌ప్రెస్‌ను సైతం దుండగులు అదే ప్రాంతంలో ఆపివేశారు. అయిదారుగురు దొంగలు కలిసి గాఢనిద్రలో ఉన్న పద్మావతి, వర్ధనమ్మ, వి.కుమార్‌ తదితర ప్రయాణికుల మెడల్లోని బంగారు గొలుసులు, మరికొందరి నుంచి నగదు ఎత్తుకెళ్లిపోయారు. సుమారు 25 తులాల బంగారు ఆభరణాలు, రూ.20 వేల నగదు అపహరించినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. బాధిత ప్రయాణికుల ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసుకుని ఆ కేసును ఖమ్మంకు బదిలీ చేశామని సికింద్రాబాద్‌ రైల్వే పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌ఐ మజీద్‌ తెలిపారు. సంఘటనా స్థలాన్ని రైల్వే ఎస్పీ సలీమా, వైరా ఏసీపీ రెహ్మాన్, రైల్వే సీఐ వెంకటేశ్వర్లు, వైరా సీఐ సాగర్, ఎస్సై నాగుల్‌మీరా సందర్శించారు. వేలిముద్రల నిపుణుల సహాయంతో వేలిముద్రలు సేకరించారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని