Telangana News: కామారెడ్డిలో ఆర్టీసీ బస్సు బోల్తా.. 25 మందికి గాయాలు

కామారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కామారెడ్డి పట్టణంలో ఆర్టీసీ బస్సు బోల్తాపడి 25 మంది ప్రయాణికులు గాయపడ్డారు.

Updated : 13 Aug 2022 14:54 IST

కామారెడ్డి అర్బన్‌: కామారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కామారెడ్డి పట్టణంలో ఆర్టీసీ బస్సు బోల్తాపడి 25 మంది ప్రయాణికులు గాయపడ్డారు. బాన్సువాడ నుంచి బయలుదేరిన ఆర్టీసీ బస్సు నిజామాబాద్‌ చేరుకుని.. అక్కడి నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా శనివారం మధ్యాహ్నం ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. కామారెడ్డి జిల్లా బాన్సువాడ డిపోకు చెందిన ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్‌ బస్సు శనివారం బాన్సువాడ నుంచి హైదరాబాద్‌ వెళ్తోంది. కామారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ సమీపంలోకి రాగానే పాత జాతీయ రహదారిపై అదుపుతప్పి డివైడర్‌ ఎక్కి బోల్తా పడింది. రహదారిపై బస్సు పల్టీ కొట్టడాన్ని గమనించిన స్థానికులు అక్కడికి చేరుకుని బస్సు అద్దాలు ధ్వంసం చేసి ప్రయాణికులను బయటకు తీశారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో డ్రైవర్‌, కండక్టర్‌తోపాటు మొత్తంగా 29 మంది ఉన్నారు. ప్రమాదంలో 25 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను 108 వాహనంలో జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిని హైదరాబాద్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం లేకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై ఆర్టీసీ ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని