Crime News: బాగా చదివి లాయర్‌ కావాలనుకుని.. ఉన్మాది చేతిలో కత్తి పోట్లకు బలైపోయింది

ఆస్పత్రిలో అచేతనంగా పడి ఉన్న కూతురు మృతదేహాన్ని చూసి ఆమె తండ్రి కన్నీరుమున్నీరుగా విలపించారు. భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో బతుకుతున్న కూతురు లేదనే నిజం ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టేసింది.

Published : 30 May 2023 01:49 IST

దిల్లీ: తల్లిదండ్రులు ఇద్దరు రోజువారీ కూలీలు. వారు తమ కోసం పడుతున్న కష్టాన్ని చూసి ఆ యువతి బాగా చదివి జీవితంలో ఉన్నతంగా స్థిరపడాలనుకుంది. దానికి తగినట్లుగానే పదో తరగతిలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. ఆ ఆనందాన్ని కుంటుంబ సభ్యులతో పంచుకుంటూ భవిష్యత్తులో న్యాయవాదిగా కావాలన్న తన కలను తండ్రితో చెప్పింది. కానీ, అప్పటికి ఆమెకు తెలియదు మృత్యువు తన స్నేహితుడి రూపంలో ఎదురుచూస్తుందని. ఎంతో ఆనందంతో స్నేహితురాలి ఇంట్లో పుట్టినరోజు వేడుకకు బయలుదేరిన బాలికను వెంబడించిన ఉన్మాది ఆమెపై విచక్షణారహితంగా కత్తితో దాడి చేశాడు. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 20 సార్లు కత్తితో పొడిచి, బండరాయితో మోది దారుణంగా హత్య చేశాడు. ఆదివారం దిల్లీ రోహిణి ప్రాంతంలోని షాబాద్‌ డెయిరీ ప్రాంతానికి చెందిన సాక్షి అనే పదహారేళ్ల బాలిక ఆశయం గురించి ఆమె తండ్రి ఆవేదనతో చెప్పిన మాటలు ఇవి.. 

ఆస్పత్రిలో అచేతనంగా పడి ఉన్న సాక్షి మృతదేహాన్ని చూసి ఆమె తండ్రి జనక్‌రాజ్‌ కన్నీరుమున్నీరుగా విలపించారు. నిందితుణ్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. కానీ, పోలీసులు మాత్రం సాక్షికి, నిందితుడు సాహిల్‌ గత కొంత కాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారని, శనివారం వారిద్దరి మధ్య వాగ్వివాదం జరిగిందని చెబుతున్నారు. ఆదివారం పుట్టినరోజు వేడుక కోసం బయటకు వచ్చిన సాక్షిని అనుసరించి ఆమెతో మరోమారు సాహిల్ వాగ్వివాదానికి దిగాడు. ఈ క్రమంలో ఆగ్రహంతో ఆమెను దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. సాక్షి తల్లిదండ్రులు మాత్రం నిందితుడికి, తమ కుమార్తెకు మధ్య ఉన్న స్నేహం గురించి తమకు తెలియదని అంటున్నారు. 
సాక్షి హత్యతో దిల్లీలోని షాబాద్‌ డెయిరీ ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గత కొంతకాలంగా ఆకతాయిలు ఆకృత్యాలు ఈ ప్రాంతంలో పెరిగిపోయాయని, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానికుడు ఒకరు వాపోయారు.

ఈ వ్యవహారం మొత్తం అక్కడి సీసీటీవీల్లో (CCTV) రికార్డు అయ్యింది. వీధిలో జరుగుతున్న ఈ దారుణాన్ని పలువురు చూసుకుంటూ వెళ్తున్నప్పటికీ, ఎవ్వరూ అతడిని నిలువరించడానికి ప్రయత్నించలేదు. ఓ వ్యక్తి తమ కుమార్తెపై దాడిని అడ్డుకునేందుక ప్రయత్నించగా అతనిపై కూడా దాడి చేసినట్లు సాక్షి తండ్రి చెప్పారు. ప్రస్తుతం గాయాలతో ఉన్న అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు షాబాద్‌ డెయిరీ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. యవతి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడి అరెస్టు చేశారు. 

మరోవైపు ఈ ఘటనను దిల్లీ మహిళా కమిషన్‌ తీవ్రంగా పరిగణించింది. దిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ స్వాతి మాలివాల్‌  ట్విటర్‌లో స్పందించారు. ‘‘దిల్లీ షాబాద్‌ డెయిరీ వద్ద ఓ అమాయక బాలిక హత్యకు గురైంది. దిల్లీలో నేరగాళ్లకు అడ్డూ అదుపులేకుండా పోయింది. దీనిపై పోలీసులకు నోటీసులు జారీ చేశాము. అన్ని హద్దులను దాటేశారు. నా కెరీర్‌లో ఇంత ఘోరాన్ని నేను చూడలేదు’’ అని పేర్కొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని