Hyd News: ‘నా సోదరులే హత్య చేశారు’: రెండు నెలల బాబుతో సంజన ధర్నా

నగరంలోని బేగంబజార్‌లో పరువు హత్య నేపథ్యంలో బేగంబజార్‌ కూడలిలో మృతుడు నీరజ్‌ భార్య సంజన రెండు నెలల వయసున్న బాబుతో ధర్నాకు దిగారు.

Updated : 21 May 2022 13:56 IST

హైదరాబాద్‌: నగరంలోని బేగంబజార్‌లో పరువు హత్య నేపథ్యంలో బేగంబజార్‌ కూడలిలో మృతుడు నీరజ్‌ భార్య సంజన రెండు నెలల వయసున్న బాబుతో ధర్నాకు దిగారు. సంజన బంధువులు కూడా ఇందులో పాల్గొన్నారు. నిందితులను ఉరి తీయాలని వారు డిమాండ్‌ చేశారు. తన సోదరులే ఈ హత్య చేసినట్లు సంజన ఆరోపించారు. ఏడాదిగా తన సోదరులు బెదిరిస్తున్నట్లు ఆమె చెప్పారు. పీఎస్‌లో ఫిర్యాదు చేసినా తన సోదరులు వెనక్కి తగ్గలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించి పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. హత్య చేసిన వారిని గుర్తు పట్టేందుకు సంజనను పోలీసులు పీఎస్‌కు తీసుకెళ్లారు.

భయపడి పారిపోయారు..
మరోవైపు సంజన తల్లి మధుబాయి మీడియాతో మాట్లాడారు. ‘‘నా కూతురు సంసారాన్ని నాశనం చేశారు. హత్య చేసిన వాళ్లని ఉరి తీయాలి. నీరజ్ హత్యలో మా కుటుంబ ప్రమేయం లేదు. గత ఆరు నెలలుగా నా కూతురిని, అల్లుడిని చంపుతామని కొందరు బెదిరించారు. వాళ్లు ఎవరనేది తెలియదు. హత్య జరిగిన సమయంలో నా కుమారుడు రితేష్, బావ కుమారులు నలుగురూ ఇంట్లోనే ఉన్నారు. హత్యతో వాళ్లకి ఎలాంటి సంబంధం లేదు. హత్య జరిగిన విషయం తెలుసుకొని భయపడి ఇంట్లో నుంచి పారిపోయారు’’ అని మధుబాయి తెలిపారు.

ఇలా జరుగుతుందని ఊహించలేదు..

సంజన సోదరి మమత మాట్లాడుతూ.. ‘‘ఏడాదిగా సంజనతో మా కుటుంబానికి మాటలు లేవు. మా అమ్మ ఆరోగ్యం బాగా లేకపోవడంతో రెండు నెలలుగా సంజన నాతో ఫోన్‌లో మాట్లాడుతోంది. ప్రేమ వివాహం ఇష్టం లేకే ఆమెని దూరం పెట్టాం. భర్తతో కలిసి  సంతోషంగా ఉండాలని మేము కోరుకున్నాం. కానీ ఇలా జరుగుతుందని ఊహించలేదు. హత్యతో మా కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదు’’ అని తెలిపారు.

ఆందోళన విరమించిన కుటుంబ సభ్యులు

నీరజ్‌ హత్య నేపథ్యంలో షాహీనయత్ గంజ్ పీఎస్ ఎదుట అతని కుటుంబ సభ్యులు, బంధువులు చేపట్టిన ఆందోళనను విరమించారు. అంతకముందు గంట పాటు రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. నిందితులను తమ ముందు ఉంచాలని డిమాండ్ చేశారు. చట్టపరంగా శిక్ష పడేలా చూస్తామని వారికి పోలీసులు హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే రాజసింగ్ చొరవతో కుటుంబ సభ్యులు, వ్యాపారులు ఆందోళన విరమించారు.

నీరజ్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి..

నిన్న జరిగిన హత్యలో మృతిచెందిన నీరజ్‌ మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని