Crime News: హాస్టల్‌ వార్డెన్‌ నిర్లక్ష్యానికి మూల్యం.. ప్రాణాలు కోల్పోయిన విద్యార్థి

ప్రమాదవశాత్తూ పాఠశాల ఆవరణలో ఉన్న బావిలో పడి విద్యార్థి మృతి చెందిన ఘటన కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలంలోని ఎల్ఎండీ కాలనీలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది..

Published : 04 Dec 2022 21:58 IST

తిమ్మాపూర్‌: ప్రమాదవశాత్తూ పాఠశాల ఆవరణలో ఉన్న బావిలో పడి విద్యార్థి మృతి చెందిన ఘటన కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలంలోని ఎల్ఎండీ కాలనీలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్‌ జిల్లాలోని జూలపల్లి మండలం తేలుకుంట గ్రామానికి చెందిన రాధా, శ్రీనివాస్‌ దంపతులకు ఇద్దరు సంతానం. శ్రీనివాస్‌ హైదరాబాద్‌లో డ్రైవింగ్‌ స్కూల్‌ నిర్వహిస్తూ అక్కడే తన భార్య, కుమార్తెతో ఉంటున్నారు. కుమారుడు మారం శ్రీకర్‌(13) కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని రామకృష్ణకాలనీలో అమ్మమ్మ  పర్యవేక్షణలో ఎల్‌ఎండీ కాలనీలోని సెయింట్‌ ఆంథోని ప్రైవేటు పాఠశాల హాస్టల్‌లో ఉంటూ ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. ఆదివారం సాయంత్రం పాఠశాల ఆవరణలోని బావిలో చెత్తను తొలగించాలంటూ శ్రీకర్‌తోపాటు మరో ఐదుగురు విద్యార్థులను  వసతిగృహం వార్డెన్‌ బావిలోకి దింపాడు. చెత్తను తొలగించిన అనంతరం ఐదుగురు విద్యార్థులు బయటకు రాగా, శ్రీకర్‌ ప్రమాదవశాత్తు బావిలో మునిగిపోయి ప్రాణాలు కోల్పోయాడు.

సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సుమారు గంట పాటు శ్రమించి శ్రీకర్‌ మృతదేహాన్ని బావి నుంచి వెలికితీశారు. విద్యార్థి మునిగిపోవడం గమనించిన తోటి విద్యార్థులు గట్టిగా కేకలు వేయడంతో భయపడిపోయిన పాఠశాల వార్డెన్‌ అక్కడి నుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కూడా అక్కడి నుంచి అదృశ్యమయ్యాడు. పాఠశాల విద్యార్థులను బావిలోకి దించి పనులు చేయించడం.. దీని వల్ల విద్యార్థి ప్రాణాలు పోయాయని విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాల వద్ద ఆందోళనకు దిగాయి. శ్రీకర్‌ కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని