బిహార్‌లో కీచక ప్రిన్సిపల్‌కు ఉరిశిక్ష

పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న పదకొండేళ్ల చిన్నారిపై అత్యాచారం కేసులో ఓ కీచక ప్రిన్సిపల్‌కు ఉరిశిక్ష పడింది. ఈ ఘటన బిహార్‌లోని పట్నాలో చోటుచేసుకుంది.......

Published : 17 Feb 2021 01:03 IST

సహకరించిన ఉపాధ్యాయుడికి జీవితఖైదు

పట్నా: పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న పదకొండేళ్ల చిన్నారిపై అత్యాచారం కేసులో ఓ కీచక ప్రిన్సిపల్‌కు ఉరిశిక్ష పడింది. ఈ ఘటన బిహార్‌లోని పట్నాలో చోటుచేసుకుంది. నిందితుడికి సహకరించిన మరో ఉపాధ్యాయుడికి కోర్టు జీవితఖైదు విధించింది. పోక్సో ప్రత్యేక న్యాయమూర్తి అవధేశ్‌ కుమార్‌ ఈ మేరకు తీర్పును వెలువరించారు. కేసు వివరాలు ఇలా ఉన్నాయి. ఫుల్వారీ షరీఫ్‌ ప్రాంతానికి చెందిన బాధిత బాలిక ఓ పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది. 2018 సెప్టెంబరులో బాధిత చిన్నారి తరచూ అనారోగ్యం పాలవుతుండటంతో ఆమె తల్లిదండ్రులు వైద్య పరీక్షలు చేయించారు. అప్పుడు ఆ బాలిక గర్భవతి అని నిర్ధరణ కావడంతో అసలు విషయం బయటపడింది. దీంతో సమీప మహిళా పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాలిక చదువుతున్న పాఠశాల ప్రిన్సిపల్‌ అరవింద్‌ కుమార్‌ ఆమెపై అత్యాచారం చేయగా, మరో ఉపాధ్యాయుడైన అభిషేక్‌ కుమార్‌ ఈ దుశ్చర్యకు సహకరించాడు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు ప్రిన్సిపల్‌, టీచర్‌ను అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి నేడు పట్నాలోని పోక్సో ప్రత్యేక న్యాయస్థానం కోర్టు ప్రిన్సిపల్‌కు మరణశిక్షతో పాటు రూ.లక్ష జరిమానా విధించింది.  అలాగే, అతడికి సహకరించిన ఉపాధ్యాయుడికి రూ.50వేల జరిమానా, జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని