Medak: బీమా కోసం డ్రామా.. మెదక్‌లో వ్యక్తి సజీవదహనం కేసులో ట్విస్ట్‌

మెదక్‌లో వ్యక్తి సజీవదహనం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. బీమా డబ్బుల కోసమే డ్రైవర్‌ను చంపేసి నాటకం ఆడినట్లు పోలీసులు తేల్చారు. నిందితుడిని పోలీసులు గోవాలో అదుపులోకి తీసుకున్నారు. 

Updated : 17 Jan 2023 12:22 IST

టేక్మాల్‌: మెదక్‌ జిల్లాలోని టేక్మాల్ మండలం వెంకటాపురంలో వ్యక్తి సజీవ దహనం కేసులో అనూహ్య మలుపు చోటుచేసుకుంది. ఈ నెల 9వ తేదీన జిల్లాలోని టేక్మాల్‌ మండలం వెంకటాపురం వద్ద కారులో వ్యక్తి సజీవదహనం అయ్యాడు. మొదటగా ఈ ప్రమాదంలో మృతి చెందింది భీమ్లా తండాకు చెందిన ధర్మగా పోలీసుల దర్యాప్తులో తేలింది. హైదరాబాద్‌ సెక్రటేరియేట్‌లో సీనియర్‌ అసిస్టెంట్‌గా ఆయన పని చేస్తున్నారు. ధర్మ భార్య నీల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఘటనా స్థలంలో పెట్రోల్‌ డబ్బా దొరకడంతో పోలీసులు ఈ కేసును సవాల్‌గా తీసుకున్నారు. దీంతో దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులు.. ధర్మ సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా తను ఇంకా బతికే ఉన్నాడని భావించి ఆ దిశగా దర్యాప్తు కొనసాగించారు. ధర్మ బతికే ఉన్నాడని.. గోవాలో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఒక బృందం అక్కడికి వెళ్లి నిందితుడిని హైదరాబాద్‌కు తీసుకొచ్చి తమదైన శైలిలో విచారించగా విస్తుపోయే విషయం వెలుగులోకి వచ్చింది. ప్రమాదంలో చనిపోయింది కారు డ్రైవర్‌ అని పోలీసులు గుర్తించారు. ధర్మ బెట్టింగ్‌లు ఆడి అప్పుల పాలయ్యాడని.. బీమా డబ్బులు వస్తే అప్పులు తీర్చొచ్చని భావించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. బీమా డబ్ముల కోసమే ధర్మ నాటకం ఆడినట్లు పోలీసులు తేల్చారు. డ్రైవర్‌ను చంపి కారులో ఉంచి పెట్రోల్‌ పోసి నిప్పు పెట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ధర్మను ఇవాళ కోర్టులో హాజరుపరిచేందుకు అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని