Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు ఇంజినీరింగ్‌ విద్యార్థుల దుర్మరణం

Road Accident in Assam: అస్సాంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు ఇంజినీరింగ్‌ విద్యార్థులు దుర్మరణం చెందారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.

Updated : 29 May 2023 11:11 IST

గువాహటి: అస్సాం (Assam)లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. గువాహటిలోని జలూక్‌బరీ ప్రాంతంలో కారు.. వ్యాను ఢీకొన్నాయి. సోమవారం తెల్లవారుజామున జరిగిన దుర్ఘటనలో ఏడుగురు ఇంజినీరింగ్‌ విద్యార్థులు (Engineering Students) అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఆరుగురు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

గువాహటిలోని అస్సాం ఇంజినీరింగ్‌ కాలేజీ (Assam Engineering College)లో మూడో సంవత్సరం చదువుతున్న పది మంది విద్యార్థులు నిన్న అర్ధరాత్రి దాటాక కాలేజీ ప్రాంగణం నుంచి కారులో బయల్దేరారు. ఈ తెల్లవారుజామున జలూక్‌బరీ ప్రాంతంలో వీరు ప్రయాణిస్తున్న కారు డ్రైవర్‌ వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో కారు డివైడర్‌ను దాటుకుని ఎదురుగా వస్తున్న పికప్‌ వ్యాన్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఏడుగురు విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. అటు పికప్‌ వ్యాన్‌లో ఉన్న మరో ముగ్గురు కూడా గాయపడ్డారు.

క్షతగాత్రులను గువాహటి మెడికల్‌ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. విద్యార్థులు కారును అద్దెకు తీసుకుని వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అతివేగమే ఈ ఘటనకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు