‘ఆమెది ఆత్మహత్య.. శ్రద్ధా ఘటన స్ఫూర్తితో ముక్కలు చేశా’: ముంబయి హత్య కేసులో ట్విస్ట్‌

Murder Case: ముంబయిలో సహజీవన భాగస్వామిని హత్య చేసిన కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. అయితే, ఆమెను తాను చంపలేదని, ఆత్మహత్య చేసుకుందని నిందితుడు పోలీసులకు చెప్పాడు. శ్రద్ధా వాకర్‌ ఘటన చూసి మృతదేహాన్ని కన్పించకుండా చేసేందుకు ప్రయత్నించాడట..!

Published : 09 Jun 2023 11:50 IST

ముంబయి: దిల్లీలోని శ్రద్ధా వాకర్‌ (Shraddha Walkar murder case) హత్య తరహాలోనే.. మహారాష్ట్ర (Maharashtra)లో సహజీవన భాగస్వామిని చంపి, ఆమె శరీరాన్ని ముక్కలు చేసి ఘటనలో అనూహ్య విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాను హత్య చేయలేదని, ఆమే ఆత్మహత్యకు పాల్పడిందని నిందితుడు మనోజ్‌ సానే పోలీసుల విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది. కేసులో ఇరుక్కుంటానన్న భయంతో ఆమె మృతదేహాన్ని అదృశ్యం చేసేందుకు ప్రయత్నించినట్లు అతడు చెప్పాడట. అంతేకాదు.. శ్రద్ధా వాకర్‌ ఘటనను చూసే తాను ఈ దారుణానికి పాల్పడినట్లు నిందితుడు అంగీకరించాడని పలు జాతీయ మీడియా సంస్థలు కథనాల్లో వెల్లడించాయి.

ముంబయి (Mumbai) శివారులోని మీరా-భయందర్‌ ప్రాంతంలో ఈ ఘోర ఘటన వెలుగు చూసింది. మనోజ్‌ సానే(56), సరస్వతి వైద్య(36) ఓ ఫ్లాట్‌లో అద్దెకుంటూ గత మూడేళ్లుగా సహజీవనంలో ఉన్నారు. వారు ఉంటున్న ఇంటి నుంచి బుధవారం దుర్వాసన వస్తుండటంతో గుర్తించిన పొరుగింటివారు, హౌసింగ్‌ సొసైటీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు ఘటనా స్థలానికి చేరుకోవడంతో సరస్వతి హత్య గురించి వెలుగులోకి వచ్చింది. ఆ ఇంట్లో మృతురాలి శరీర భాగాల ముక్కలను బకెట్‌, టబ్‌ల్లో పోలీసులు గుర్తించారు. పోలీసుల రాకను గమనించి మనోజ్‌ పారిపోయేందుకు ప్రయత్నించగా.. అతడిని అరెస్టు చేశారు. విచారణలో అతడు చెప్పిన విషయాలు విని పోలీసులు కంగుతిన్నారు.

సహజీవనం కాదు.. కుమార్తె లాంటిది..

తాను హెచ్‌ఐవీ బాధితుడినని మనోజ్‌ పోలీసులు చెప్పాడు. చాలా ఏళ్ల క్రితమే ఈ వ్యాధి బారిన పడినట్లు తెలిపాడు. మృతురాలు సరస్వతితో తనకు శారీరక సంబంధం లేదని, ఆమెను తాను కుమార్తెలా చూసుకున్నానని నిందితుడు చెప్పినట్లు తెలుస్తోంది. ‘‘సరస్వతి పదో తరగతి పరీక్షలు రాయాలనుకుంది. ఇందుకోసం నేను ఆమెకు గణిత పాఠాలు చెప్పేవాడిని. అయితే, ఆమె చాలా సంకుచితంగా ఉండేది. నేను ఎప్పుడు ఆలస్యంగా ఇంటికి వచ్చినా అనుమానించేది. అయితే, జూన్‌ 3న నేను బయటి నుంచి ఇంటికి వచ్చే సరికి ఆమె ఆత్మహత్య చేసుకుని కన్పించింది. కేసులో ఇరుక్కుంటానన్న భయంతో ఆమె మృతదేహాన్ని మాయం చేయాలనుకున్నా. దిల్లీలో జరిగిన శ్రద్ధా వాకర్ హత్య ఘటన గురించి తెలుసుకుని అదే తరహాలో మృతదేహాన్ని ముక్కలు చేశా. ఆ తర్వాత నేనూ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’’ అని నిందితుడు పోలీసులకు తెలిపినట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి.

56 ఏళ్ల మనోజ్‌ ఐటీఐలో శిక్షణ పొందాడు. అయితే, సరైన ఉద్యోగం దొరక్క గత 10 ఏళ్లుగా రేషన్‌ షాపులో పనిచేస్తున్నాడు. ఇక మృతురాలు సరస్వతి అనాథ. రేషన్‌ దుకాణంలో పరిచయమైన వీరిద్దరూ మూడేళ్లుగా ఒకే ఫ్లాటులో ఉంటున్నట్లు స్థానికులు తెలిపారు. నిందితుడి ఇంటి వంటగదిలో మహిళ శరీరభాగాలను గుర్తించిన పోలీసులు వాటిని ఫోరెన్సిక్ విభాగానికి పంపించారు. కేసులో దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలిపారు. నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టగా.. జూన్‌ 16 వరకు పోలీసు కస్టడీకి అనుమతించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని