Hyderabad: సైబర్‌ నేరగాళ్లు కాజేసిన రూ.31 కోట్లు.. బాధితులకు అందజేసిన అధికారులు

సైబర్‌ నేరాల్లో బాధితుల నుంచి నేరగాళ్లు కాజేసిన సొమ్మును తిరిగి తీసుకొచ్చేందుకు తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో తీవ్రంగా కృషి చేస్తోంది. 

Published : 16 Jun 2024 19:27 IST

హైదరాబాద్‌: సైబర్‌ నేరాల్లో బాధితుల నుంచి నేరగాళ్లు కాజేసిన సొమ్మును తిరిగి తీసుకొచ్చేందుకు తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో తీవ్రంగా కృషి చేస్తోంది. ఇందులో భాగంగా గత మూడు నెలల వ్యవధిలో తెలంగాణ లీగల్ సర్వీసెస్‌ అథారిటీతో కలిసి.. బాధితులు పొగొట్టుకున్న సొమ్ము రూ.31.29 కోట్లు తిరిగి వారికి ఇచ్చినట్టు బ్యూరో డైరెక్టర్‌ శిఖా గోయల్‌ తెలిపారు. 

దీంతో పాటు సైబర్ నేరాలకు సంబంధించి దీర్ఘ కాలంగా బ్యాంకుల వద్ద నిలిచి పోయిన బాధితుల సొమ్మును లోక్‌ ఆదాలత్ ద్వారా కూడా వారికి ఇప్పించినట్లు తెలిపారు. సైబర్ నేరాల్లో బాధితులు పోగొట్టుకున్న సొమ్మును వారి ఫిర్యాదు ద్వారా ఫ్రీజ్ చేసిన తర్వాత వాటిని 457 సెక్షన్ కింద దర్యాప్తు అధికారి కోర్టులో పిటిషన్ ఫైల్ చేస్తే న్యాయస్థానం అనుమతితో వాటిని బాధితులకు తిరిగి ఇచ్చే అవకాశం ఉందన్నారు. కేవలం హైదరాబాద్‌లోనే కాకుండా జిల్లాల్లో కూడా దీనిపై అవగాహన కల్పిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఇలా ఇప్పటి వరకూ 5,142 పిటిషన్లకు సంబంధించిన రూ.31.29 కోట్లు బాధితులకు తిరిగి ఇచ్చినట్లు పేర్కొన్నారు. పోలీసులు, న్యాయ వ్యవస్థ కలిసి ఆర్థిక సైబర్ నేరాల్లో బాధితులకు న్యాయం చేకూర్చే అవకాశం ఉందని శిఖా గోయల్ వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని