Raj kundra case: రాజ్‌కుంద్రాతో శిల్పాశెట్టి విడిపోనుందా?

అశ్లీల చిత్రాల వ్యాపారం కేసులో అరెస్టయిన భర్త రాజ్‌కుంద్రా నుంచి విడిపోయేందుకు శిల్పాశెట్టి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.....

Updated : 02 Sep 2021 10:16 IST

ముంబయి: అశ్లీల చిత్రాల వ్యాపారం కేసులో అరెస్టయిన భర్త రాజ్‌కుంద్రా నుంచి విడిపోయేందుకు శిల్పాశెట్టి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తన సంతానాన్ని కూడా రాజ్‌కుంద్రాకు దూరంగా ఉంచుతున్నట్లు సమాచారం. అశ్లీల చిత్రాలను చిత్రీకరించి వాటిని విక్రయిస్తున్న కేసులో ముంబయి పోలీసులు రాజ్‌కుంద్రాను అరెస్టు చేశారు. భర్త వ్యాపారంపై శిల్పాశెట్టిని కూడా పోలీసులు విచారించారు. అయితే ఆయన వ్యాపారం గురించి తనకేమీ తెలియదని.. ఆ విచారణ సందర్భంగా నటి కన్నీరుమున్నీరైంది. భర్త చేసే ఈ చీకటి వ్యాపారం పట్ల విస్తుపోయిన శిల్పా అతడి నుంచి విడిపోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

శిల్పాశెట్టి స్నేహితురాలు ఒకరు ఓ న్యూస్‌ ఛానెల్‌తో మాట్లాడుతూ.. ‘రాజ్‌కుంద్రాపై ఆరోపణలు రెట్టింపవుతున్నాయి. ఆయన అశ్లీల చిత్రాల వ్యాపారం వెలుగులోకి రావడంతో శిల్పా షాక్‌కు గురైంది. ఆ విషయం తెలిసి మేం కూడా ఖంగుతిన్నాం’ అని ఆమె పేర్కొన్నారు. ‘రాజ్‌కుంద్రాకు చెందిన ఆస్తులకు సంబంధించి శిల్పా ఒక్క రూపాయిని కూడా ముట్టుకోవడం లేదు. సినిమాలు చేస్తూ, రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ ఆమె బాగానే సంపాదిస్తోంది. ఈ మధ్యే ‘హంగామా2’, ‘నికమ్మా’ సినిమాల్లో నటించిన శిల్పా మరిన్ని సినిమాలు చేసేందుకు సిద్ధంగా ఉంది’ అని నటి సన్నిహితురాలు పేర్కొన్నారు.

శిల్పాశెట్టి, రాజ్‌కుంద్రా 2009లో వివాహం చేసుకున్నారు. వారికి కుమారుడు వియాన్‌, కుమార్తె షమీశా ఉన్నారు. రాజ్‌కుంద్రా అశ్లీల చిత్రాలను తెరకెక్కించడమే కాకుండా వాటిని యాప్‌లలో అప్‌లోడ్‌ చేసినట్లు పోలీసులు పేర్కొంటూ జులై 19న ఆయనను అరెస్టు చేశారు. 121 పోర్న్‌ వీడియోలకు సంబంధించిన అతి పెద్ద డీల్‌ను చేసుకున్నారని పోలీసులు కోర్టుకు వెల్లడించారు. ఆ మొత్తం వీడియోల విక్రయానికి గానూ 1.2 మిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.9కోట్లు) ఒప్పందం కుదుర్చుకున్నట్లు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని