Shiv Sena: మద్యం మత్తులో ‘బీఎండబ్ల్యూ’ నడిపి.. మహిళ ఉసురు తీసిన శివసేన యువనేత

పుణెలో జరిగిన టీనేజరు కారు ప్రమాద ఘటన మరవకముందే ముంబయిలో అదే తరహా మరో ప్రమాదం నమోదైంది. శరవేగంగా వచ్చిన బీఎండబ్ల్యూ కారు రోడ్డుపై వెళుతున్న స్కూటీని ఢీకొట్టడంతో వివాహిత మృతిచెందారు.

Published : 08 Jul 2024 03:46 IST

ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కావేరి నక్వా

ముంబయి: పుణెలో జరిగిన టీనేజరు కారు ప్రమాద ఘటన మరవకముందే ముంబయిలో అదే తరహా మరో ప్రమాదం నమోదైంది. శరవేగంగా వచ్చిన బీఎండబ్ల్యూ కారు రోడ్డుపై వెళుతున్న స్కూటీని ఢీకొట్టడంతో వివాహిత మృతిచెందారు. ఆ కారు.. మహారాష్ట్రలోని పాల్ఘర్‌ జిల్లా శివసేన నేత రాజేష్‌ షాకు చెందినదిగా పోలీసులు తెలిపారు. నిందితుడిని షా కుమారుడైన యువనేత మిహిర్‌ షా (24)గా గుర్తించారు. పోలీసు కథనం ప్రకారం.. ఆదివారం ఉదయం 5.30 గంటల ప్రాంతంలో ముంబయిలోని వర్లీ ప్రాంతంలో మిహిర్‌ మద్యం మత్తులో బీఎండబ్ల్యూ కారును వేగంగా నడుపుతూ ముందు వెళ్తున్న స్కూటీని ఢీకొట్టాడు. దీంతో స్కూటీపై ఉన్న దంపతులు ఎగిరిపడ్డారు. వేగంగా వెళ్తున్న కారు మహిళపై నుంచి దూసుకెళ్లడంతో కావేరి నక్వా (45) అక్కడికక్కడే మరణించింది. ఆమె భర్త ప్రదీప్‌కు స్వల్పగాయాలయ్యాయి. చేపలు అమ్ముకుంటూ జీవిస్తున్న ఈ దంపతులు ఇంటికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. నిందితుడు పరారీలో ఉండటంతో అతడి తండ్రితోపాటు ప్రమాదం జరిగినప్పుడు కారులోనే ఉన్న డ్రైవరును పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. ప్రమాదం అనంతరం నిందితులు సాక్ష్యాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నించినట్లుగా పోలీసులు తెలిపారు. నిందితుడు మిహిర్‌ శనివారం అర్ధరాత్రి ఓ బార్‌లో మద్యం తాగాడు. తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో కారు తానే నడుపుతానని పట్టుబట్టి డ్రైవరు సీటులోకి మారి ప్రమాదానికి కారణమయ్యాడు. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే మాట్లాడుతూ.. చట్టం అందరికీ సమానమే, ఎవరినీ విడిచిపెట్టబోమని తెలిపారు. ఉద్ధవ్‌ వర్గం శివసేన నాయకుడు, స్థానిక ఎమ్మెల్యే ఆదిత్యఠాక్రే ‘ఎక్స్‌’ ద్వారా స్పందిస్తూ.. పోలీసులు న్యాయం చేస్తారని, రాజకీయ ఆశ్రిత పక్షపాతం ఉండదని నమ్ముతున్నట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని