అక్కాచెల్లెళ్ల మరణానికి ఆ నమ్మకమే కారణమా?

ఒక వ్యక్తి నమ్మకం కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. మితిమీరిన విశ్వాసం.. మూఢనమ్మకం.. మూర్ఖపు పరిణామాలకు దారితీసింది. కని పెంచిన చేతులో కన్న బిడ్డలను బలితీసుకునే దారుణానికి ఒడిగట్టింది. చిత్తూరు జిల్లా మదనపల్లె జంట హత్యల కేసులో

Published : 29 Jan 2021 02:05 IST

మదనపల్లె ఘటన: విస్తుగొలుపుతున్న అలేఖ్య పోస్ట్‌లు

ఇంటర్నెట్‌డెస్క్‌, హైదరాబాద్‌: ఒక వ్యక్తి నమ్మకం కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. మితిమీరిన విశ్వాసం.. మూఢనమ్మకం.. మూర్ఖపు పరిణామాలకు దారితీసింది. కని పెంచిన చేతులతో కన్న బిడ్డలను బలితీసుకునే దారుణానికి ఒడిగట్టింది. చిత్తూరు జిల్లా మదనపల్లె జంట హత్యల కేసులో వెలుగుచూస్తున్న విషయాలు విస్తుగొలుపుతున్నాయి. ఈ ఘటనలో పెద్ద కుమార్తె అలేఖ్య ‘మూఢత్వం’, పునర్జన్మలపై అతి విశ్వాసం అక్కాచెల్లెళ్ల హత్యకు కారణమైంది. హత్యలకు ముందు అలేఖ్య సోషల్‌మీడియాలో చేసిన పోస్ట్‌లు.. ఆమె ఆలోచనా ధోరణికి, మానసిక స్థితికి అద్దంపడుతున్నాయి. 

మదనపల్లెకు చెందిన పురుషోత్తం, పద్మజల పెద్ద కుమార్తె అలేఖ్య మరణానికి ముందు తన సోషల్‌మీడియా ఖాతాలో కొన్ని పోస్ట్‌లు పెట్టింది. ఈ నెల 22న తన పేరును మోహినిగా మార్చుకున్నట్లు పేర్కొన్న ఆమె.. తనని తాను ‘ప్రపంచ సన్యాసి’నని చెప్పుకొంది. ఆ తర్వాత ‘‘శివుడు వస్తున్నాడు’’.. ‘‘పని పూర్తయింది’’ అంటూ మరికొన్ని పోస్టులు చేసింది. శివుడిని ఆరాధించే అలేఖ్య.. పుట్టుక, చావు తన చేతుల్లోనే ఉన్నాయని బలంగా విశ్వసించడం గమనార్హం. 

లాక్‌డౌన్‌లో విపరీతంగా పుస్తకపఠనం..

కరోనా కారణంగా లాక్‌డౌన్‌ విధించడంతో చిత్తూరుకు వచ్చిన అలేఖ్య.. నెలల తరబడి ఇంటికే పరిమితమైంది. సహజంగానే పుస్తకాలపై ఆసక్తి ఉన్న ఆమె.. లాక్‌డౌన్‌ కాలాన్ని పూర్తిగా పుస్తక పఠనానికే కేటాయించింది. మహాభారతం వంటి చారిత్రక పుస్తకాలతో పాటు.. రాజకీయాలు, స్త్రీ సమానత్వం... వంటి అంశాలపై పుస్తకాలను కూడా చదివింది. ఆ ప్రభావం అలేఖ్యపై బాగానే పడినట్లు కన్పిస్తోంది. 

అయస్కాంతశక్తిగా.

ఓ ఆధ్యాత్మికవేత్తను తన గురువుగా భావిస్తున్న అలేఖ్య.. తరచూ ఆయన చెప్పిన కొటేషన్లను పోస్ట్‌ చేసేది. ఆయనను తన ప్రేమికుడిగా పేర్కొన్న ఆమె.. తన స్టడీరూంలో అతడి ఫొటోను పెట్టుకుంది. ఆయన రాసిన పుస్తకాలను కూడా చదివింది. వివాహ వ్యవస్థపై నమ్మకం కోల్పోయినట్లు కూడా ఆమె పోస్ట్‌లను బట్టి తెలుస్తోంది. జుట్టును కొప్పుగా చుట్టుకుని హెయిర్‌ పిరమిడ్‌ అని, అది ఆమె అయస్కాంత శక్తిగా అభివర్ణించింది. 

నిరాశ నుంచి భయంలోకి..

ఈ నెల 15న ఆమె ఓ కవితను పోస్ట్‌ చేసింది. అందులో ఆమె నిరాశలో కూరుకుపోయినట్లు తెలుస్తోంది. ‘‘నా గుండె నిశ్శబ్దంగా ఏడుస్తోంది. ప్రతి ఒక్కరినీ ఆకట్టుకోవడం కోసం నేను ఎవరినో కావాలని ప్రయత్నిస్తున్నాను.. కానీ అవి ఫలించలేదు. నా ఆశలు కాలిపోయాయి. నిరాశ అనే అగాధంలో కూరుకుపోయాను. ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పలేక గందరగోళంలో పడిపోయాను. ఇలాంటి సమయంలో నాలో కొత్త ఆలోచనలు ఉదయించాయి. వాటిని నేను హృదయపూర్వకంగా స్వీకరిస్తున్నాను’’ అని ఆమె రాసుకొచ్చింది. 

ఇవీ చదవండి..

మూఢత్వం.. అనర్థం

బిడ్డలిద్దరూ శివపార్వతులు.. నేను కాళికను

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని