Hyderabad: ‘స్వప్నలోక్‌’ అగ్నిప్రమాదం.. షార్ట్‌ సర్య్కూట్‌ కారణంగానే..!: అగ్నిమాపక డీజీ

స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌లో జరిగిన అగ్నిప్రమాదంపై అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి స్పందించారు. ఈ ఘటనకు షార్ట్‌ సర్య్కూట్‌ ప్రధాన కారణంగా భావిస్తున్నామని తెలిపారు.

Updated : 17 Mar 2023 13:41 IST

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌లో రద్దీగా ఉండే స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌లో (swapnalok complex) జరిగిన అగ్నిప్రమాదం (fire accident) కారణంగా 5, 7 అంతస్తుల్లో ఉన్న దుకాణాలు ధ్వంసం అయ్యాయని అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి తెలిపారు. అగ్నిప్రమాదానికి ప్రధాన కారణం షార్ట్‌ సర్య్కూట్‌గానే భావిస్తున్నామన్నారు. గురువారం రాత్రి ఏడు గంటల ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగినట్లు సమాచారం అందిందని ఆయన తెలిపారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని భవనం లోపల చిక్కుకుపోయిన 12 మందిని రక్షించామన్నారు. కానీ, దురదృష్టవశాత్తు ఆరుగురు చనిపోయారని ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

ఫైర్‌ సేఫ్టీ విషయంలో యజమానుల నిర్లక్ష్యం..

‘‘స్వప్న లోక్ బిల్డింగ్ యజమానులకు ఫైర్ సేఫ్టీ పెట్టుకోమని చెప్పాం. కానీ వారు నిర్లక్ష్యం చేశారు. భవనంలో ఫైర్ సేఫ్టీ పెట్టారు కానీ, అవి ఏమాత్రం పని చేయడం లేదు. ఈ ఘటనలో షాపు కీపర్ల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం భవనం పరిస్థితి బాగానే ఉంది. ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ ప్రతి కమర్షియల్‌ కాంప్లెక్స్‌లో తప్పనిసరిగా ఉండాలి. ఫైర్ సేఫ్టీ పెట్టుకుంటే సరిపోదు వాటి నిర్వహణ సరిగా ఉంచుకోవాలి. ప్రధానంగా కమర్షియల్ కాంప్లెక్స్‌లు లాక్ చేయకూడదు.

 తాళాలు వేసి ఉండటంతో కొంతమంది బయటకు రాలేక చనిపోయారు. వ్యాపార లావాదేవీలు నిర్వహించే వారు మెయింటనెన్స్ విషయంలో నిర్లక్ష్యం వహించకూడదు. ఈ విషయంపై గతంలో స్వప్నలోక్ కాంప్లెక్స్‌ యాజమాన్యానికి నోటీసులు ఇచ్చాం. ప్రతి కాంప్లెక్స్‌లో లిఫ్ట్‌తోపాటు మెట్ల దారి కూడా వారు తెరచి ఉంచాలి. ఏ కాంప్లెక్స్‌లోనైనా.. మెట్ల దారి లాక్ చేస్తే 101కు ఫోన్  చేయాలి’’ అని నాగిరెడ్డి సూచించారు.

కేసు నమోదు చేసిన మహంకాళి పోలీసులు

స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌ అగ్నిప్రమాద ఘటనపై సికింద్రాబాద్‌లోని మహంకాళి పోలీసులు కేసు నమోదు చేశారు. కాంప్లెక్స్‌ సూపర్‌వైజర్‌ శ్రీనివాస్‌ ఇచ్చిన ఫిర్యాదు మేర సెక్షన్‌ 304 పార్ట్ 2, 324, 420 ఐపీసీ, సెక్షన్ 9 (బి) పేలుడు పదార్థాల చట్టం, 1884 కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. భద్రతా చర్యలు తీసుకోవడంలో విఫలమైన స్వప్నలోక్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ అసోసియేషన్‌, కేడియా ఇన్ఫోటెక్‌ లిమిటెడ్‌, వికాస్‌ పేపర్‌ ఫ్లెక్సో ప్యాకేజింగ్‌ లిమిటెడ్‌, క్యూనెట్‌, విహాన్‌ డైరెక్ట్‌ సెల్లింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌పై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు