Asaduddin: తన కారుపై కాల్పులు.. అక్కడేం జరిగిందో చెప్పిన అసదుద్దీన్‌!

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌ జిల్లాలో ఎన్నికల ప్రచారం ముగించుకొని దిల్లీ వెళ్తున్న ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ కారుపై కాల్పుల ఘటన .....

Updated : 03 Feb 2022 20:38 IST

దిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌ జిల్లాలో ఎన్నికల ప్రచారం ముగించుకొని దిల్లీ వెళ్తున్న ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ కారుపై దుండగులు కాల్పులు జరిపిన ఘటన ఒక్కసారిగా కలకలం రేపింది. ఈ ఘటనలో పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే, సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే, తన కారుపై కాల్పుల సమయంలో అక్కడేం జరిగిందో అసదుద్దీన్‌ ఒవైసీ దిల్లీలో విలేకర్లకు వివరించారు. ‘‘ఇవాళ మేరఠ్‌ పర్యటనకు వెళ్లాం. అక్కడి నుంచి దిల్లీ తిరిగి వెళ్తుండగా టోల్‌ గేటు వద్ద కారు వేగం తగ్గగానే పెద్ద శబ్దం వినిపించింది. ఏంటని ఆలోచించే లోపే మరో శబ్దం వినిపించింది. మా కారులో ఉన్నవారు మనపై దాడి జరుగుతోందని చెప్పారు. అక్కడి నుంచి వెళ్లిపోతుండగా మరోసారి శబ్దం వినిపించింది. నాకు తెలిసి మూడు-నాలుగు రౌండ్ల కాల్పులు జరిగాయి. ఆ తర్వాత దిల్లీ వెళ్తూ.. ఓ ఫ్లైఓవర్‌ వద్ద ఆగాం. వారు మమ్మల్ని వెంబడిస్తున్నారనిపించింది. మాపై దాడి జరుగుతున్నప్పుడు మా వెనకాల ఉన్న వాహనంలోని డ్రైవర్‌ షూటర్‌పైకి వాహనం పోనిచ్చాడు. ఎరుపు రంగు హుడీ వేసుకున్న వ్యక్తి కిందపడ్డాడు. మరో వ్యక్తి ఆ కారుపైనా కాల్పులు జరిపాడు. ఈ ఘటనపై స్వతంత్ర దర్యాప్తు చేయాలని ఈసీని కోరుతున్నా. దీని వెనక ఎవరు ఉన్నారనే అంశంపై దర్యాప్తు చేయాల్సిన బాధ్యత యూపీ, కేంద్ర ప్రభుత్వంపై ఉంది. ఈ అంశాన్ని లోక్‌సభ స్పీకర్‌  దృష్టికి కూడా తీసుకెళ్తా’’ అని తెలిపారు.

సురక్షితంగా బయటపడినందుకు చాలా సంతోషం : కేటీఆర్‌

ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ వాహనంపై కాల్పుల ఘటనపై మంత్రి కేటీఆర్‌ స్పందించారు. సురక్షితంగా బయటపడటం చాలా సంతోషంగా ఉందన్నారు. ‘‘ అసద్‌ భాయ్.. ప్రమాదం నుంచి మీరు సురక్షితంగా బయటపడటం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి చర్యలకు పాల్పడటం దుర్మార్గం. ఈ పిరికి పంద చర్యను తీవ్రంగా ఖండిస్తున్నా.’’ అంటూ ట్వీట్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని