Bribe: అనిశాకు చిక్కిన అవినీతి అధికారులు

రౌడీషీట్‌ తెరవకుండా ఉండేందుకు ఒక వ్యక్తి నుంచి రూ.5లక్షలు లంచం డిమాండ్‌ చేసిన పోలీసు ఇన్‌స్పెక్టర్, కోల్పోతున్న భూమికి పరిహారం ఇచ్చేందుకు అవసరమైన ధ్రువపత్రానికి రూ.లక్ష ఇవ్వాలని కోరిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ అవినీతి నిరోధక శాఖ(అనిశా) అధికారులకు చిక్కారు.

Published : 22 Jun 2024 04:26 IST

రౌడీషీట్‌ తెరుస్తానని బెదిరించి రూ.5 లక్షలు డిమాండ్‌ చేసిన సూరారం పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌
భూమి ధ్రువపత్రానికి రూ.లక్ష ఇవ్వాలన్న న్యాల్‌కల్‌ ఆర్‌ఐ

ఈనాడు, హైదరాబాద్‌-షాపూర్‌నగర్, జహీరాబాద్‌ అర్బన్, న్యాల్‌కల్, న్యూస్‌టుడే: రౌడీషీట్‌ తెరవకుండా ఉండేందుకు ఒక వ్యక్తి నుంచి రూ.5లక్షలు లంచం డిమాండ్‌ చేసిన పోలీసు ఇన్‌స్పెక్టర్, కోల్పోతున్న భూమికి పరిహారం ఇచ్చేందుకు అవసరమైన ధ్రువపత్రానికి రూ.లక్ష ఇవ్వాలని కోరిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ అవినీతి నిరోధక శాఖ(అనిశా) అధికారులకు చిక్కారు. మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో శుక్రవారం జరిగిన వేర్వేరు ఘటనల వివరాలు అనిశా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్‌ జిల్లా కుత్బుల్లాపూర్‌ మండలం గాజులరామారానికి చెందిన రత్నాకరం సాయిరాజుపై భూ వివాదంలో సూరారం ఠాణాలో కేసు నమోదైంది. దీనిపై రౌడీషీట్‌ తెరుస్తానంటూ ఇన్‌స్పెక్టర్‌ ఆకుల వెంకటేశం అతడిని బెదిరించాడు. దీని నుంచి బయటపడేందుకు రూ.3 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేయగా అతడు బతిమాలి రూ.2 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. సాయిరాజ్‌ భార్య నగలు తాకట్టు పెట్టి రెండు దఫాలుగా రూ.2 లక్షలు ఇచ్చాడు. తాజాగా సాయిరాజ్‌ తన భూమిలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు సిద్ధమయ్యాడు. దీనికి అనుమతి కోసం మరోసారి ఇన్‌స్పెక్టర్‌ రూ.5 లక్షలు డిమాండ్‌ చేశాడు. దీంతో సాయిరాజ్‌ అనిశా అధికారులను సంప్రదించాడు. ఒప్పందంలో భాగంగా శుక్రవారం రాత్రి సూరారం ఠాణాలో రూ.లక్ష తీసుకుంటుండగా వెంకటేశంను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు రంగారెడ్డి జిల్లా రేంజ్‌ అనిశా డీఎస్పీ ఆనంద్‌కుమార్‌ తెలిపారు. కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు చెప్పారు. వెంకటేశంపై పలు అవినీతి ఆరోపణలుండగా గతంలో ఉన్నతాధికారులు శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. 

రూ.లక్ష ఇవ్వలేరా అని డిమాండ్‌ చేసి.. 

సంగారెడ్డి జిల్లా నిమ్జ్‌(జాతీయ ఉత్పాదక పెట్టుబడుల మండలి)లో 2 ఎకరాల 36 గుంటల భూమి కోల్పోతున్న న్యాల్‌కల్‌ మండలం గణేష్‌పూర్‌ గ్రామానికి చెందిన రైతు మల్లన్నపాటిల్‌ తన భూమిని పంచనామా చేసేందుకు తహసీల్దార్‌ కార్యాలయంలో ఆర్‌ఐ దుర్గయ్యను సంప్రదించారు. ఆయన భూ పరిహారం చెక్కుల కోసం అవసరమైన యాజమాన్య ధ్రువపత్రం జారీ చేసేందుకు రూ.లక్ష డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం రూ.43.60 లక్షలు పరిహారం ఇస్తుంటే, రూ.లక్ష ఇవ్వలేరా? అంటూ ఆర్‌ఐ రైతును ప్రశ్నించారు. దీంతో మల్లన్న పాటిల్‌ ముందుగా రూ.30 వేలు ఇచ్చారు. మిగతా రూ.70వేలు ఇవ్వకుండా మెదక్‌ రీజియన్‌ అనిశా డీఎస్పీ సుదర్శన్‌కు ఫిర్యాదు చేశారు. మిగిలిన నగదును గంగ్వార్‌ చౌరస్తాలోని దుకాణంలో శుక్రవారం ఇస్తుండగా అనిశా బృందం సభ్యులు రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్నారు. దాడుల్లో మెదక్‌ రీజియన్‌ సీఐ రమేశ్, నిజామాబాద్‌ రేంజ్‌ సీఐ వేణు, సిబ్బంది ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు లంచం కోసం డిమాండ్‌ చేస్తే 1064 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని అనిశా అధికారులు కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు