Road accident: కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గ పరిధిలోని కృత్తివెన్ను సమీపంలో శుక్రవారం వేకువజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

Published : 15 Jun 2024 06:15 IST

కంటెయినర్‌ను ఢీకొట్టిన మినీ వ్యాన్‌
ఆరుగురి దుర్మరణం.. ఐదుగురికి గాయాలు
మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం

ప్రమాదంలో ధ్వంసమైన వాహనాలు, కంటెయినర్‌లో నుంచి వేలాడుతున్న డ్రైవర్‌ మృతదేహం

మచిలీపట్నం క్రైం, న్యూస్‌టుడే: కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గ పరిధిలోని కృత్తివెన్ను సమీపంలో శుక్రవారం వేకువజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. 216 జాతీయ రహదారిపై సీతనపల్లి గ్రామ సమీపంలోని పెట్రోల్‌ బంకు వద్ద తెల్లవారుజామున 5గంటల సమయంలో చేపల పట్టుబడికి వెళ్తున్న కూలీలతో ఉన్న మినీవ్యాన్‌.. ఎదురుగా రొయ్యల ఫీడ్‌తో వస్తున్న కంటెయినర్‌ను ఢీకొట్టడంతో పెను ప్రమాదం సంభవించింది. రెండు వాహనాల డ్రైవర్లతో పాటు మరో ముగ్గురు సంఘటనా స్థలంలోనే చనిపోయారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మరో వ్యక్తి మృతి చెందారు. వాహనాల క్యాబిన్లలో చిక్కుకుపోయిన మృతదేహాలను, క్షతగాత్రులను స్థానికులు అతికష్టం మీద బయటకు తీశారు. క్షతగాత్రులను మచిలీపట్నం సర్వజనాసుపత్రికి తరలించారు. ప్రమాదం నేపథ్యంలో దాదాపు గంట పాటు ఇరువైపులా ట్రాఫిక్‌ నిలిచిపోయింది.  

మృతులు వీరే..

ఈ దుర్ఘటనలో కంటెయినర్‌ డ్రైవర్‌ తమిళనాడుకు చెందిన జయరామన్‌ (42), మినీ వ్యాన్‌లో ఉన్న తూర్పు గోదావరి జిల్లా ఉప్పలగుప్తానికి చెందిన రేవు భూషణం (26), అమలాపురానికి చెందిన కనకరాజు, కరప మండలానికి చెందిన గండి ధర్మవరప్రసాద్‌ (27), డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలానికి చెందిన చింతా లోవరాజు (32), గద్దెనపల్లికి చెందిన మాగపు నాగరాజు మృతి చెందారు. అమలాపురం వాసి సంగాని నాగేంద్రబాబు, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మల్లాడి శ్రీకాంత్, రేవు జ్ఞానేశ్వరరావు, డా. బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాకు చెందిన చింతా దుర్గాప్రసాద్, కాకినాడకు చెందిన మేడిశెట్టి మహేష్‌కుమార్‌ గాయపడ్డారు. వీరికి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. జిల్లా ఎస్పీ నయీమ్‌ అస్మి సంఘటనా స్థలాన్ని సందర్శించి ప్రమాద ఘటనపై ఆరా తీశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని