Ratlam: బస్టాప్‌లో ప్రయాణికులపైకి దూసుకెళ్లిన ట్రక్కు.. ఆరుగురి మృతి!

మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రత్లాం(Ratlam) జిల్లాలో రోడ్డుపక్కన బస్టాప్‌లో నిల్చుని ఉన్న జనాలపైకి ఓ ట్రక్కు దూసుకెళ్లిన ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు.

Published : 04 Dec 2022 23:44 IST

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రత్లాం(Ratlam) జిల్లాలో రోడ్డుపక్కన బస్టాప్‌లో నిల్చుని ఉన్న ప్రయాణికులపైకి  ఓ ట్రక్కు దూసుకెళ్లిన ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు వెల్లడించారు. జిల్లా కలెక్టర్ నరేంద్ర కుమార్ సూర్యవంశీ ఈ వివరాలను ధ్రువీకరించారు. జిల్లా కేంద్రానికి 30 కిలోమీటర్ల దూరంలో రత్లాం- లెబాడ్‌ రహదారిపై సత్రుండా గ్రామ సమీపంలోని ఓ కూడలి వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వాహనం ముందు టైరు పేలిపోవడంతో అదుపుతప్పి ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.

తమవైపు అతి వేగంగా దూసుకొచ్చిన ఆ ట్రక్కు దాదాపు 20 మందిని ఢీకొట్టిందని.. క్షతగాత్రుల్లో ఒకరైన విశాల్ తెలిపారు. ట్రక్కు ఒక్కసారిగా మీదికి రావడంతో జనాలంతా భయాందోళనకు గురై పరుగులు పెట్టారని, అంతలోనే వాహనం వారిపైనుంచి వెళ్లిందని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. రోడ్డుపైనే మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయని తెలిపారు. లారీ డ్రైవర్‌ ఘటనాస్థలం నుంచి పరారైనట్లు చెప్పారు. ప్రమాదానికి కారణమైన ట్రక్కును స్వాధీనం చేసుకున్నట్లు స్థానిక ఎస్పీ అభిషేక్ తివారీ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని