Hyderabad: అంగట్లో అమ్మకానికి 16.8 కోట్ల మంది డేటా.. ఆరుగురి అరెస్టు

దేశవ్యాప్తంగా 16.8 కోట్ల మంది వ్యక్తుల వ్యక్తిగత డేటా చోరీ చేసి సైబర్‌ నేరగాళ్లకు అమ్ముతున్న ముఠాను సైబరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు వివరాలను సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర మీడియాకు వెల్లడించారు.

Updated : 23 Mar 2023 17:36 IST

హైదరాబాద్‌: వ్యక్తిగత డేటా సేకరించి విక్రయిస్తున్న ముఠాను సైబరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా 16.8కోట్ల మందికి సంబంధించిన డేటా చోరీ చేశారని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర తెలిపారు. పలు ఆన్‌లైన్‌ వెబ్‌సైట్ల నుంచి డేటాను చోరీ చేసి ఈ ముఠా సైబర్‌ నేరగాళ్లకు అమ్ముతున్నట్లు వెల్లడించారు. పాన్ ఇండియా ప్రభుత్వ ఉద్యోగులు, పలు బ్యాంకింగ్‌ క్రెడిట్ కార్డులు, పాన్ కార్డ్, పాలసీ బజార్ వంటి పేరున్న సంస్థల నుంచి డేటా చోరీ అయిందని చెప్పారు. ఈ మేరకు సైబరాబాద్ సీపీ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.

‘‘బీమా, రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తుల సమాచారం తస్కరించినట్లు గుర్తించాం. ఫేస్‌బుక్‌ యూజర్ల ఐడీ, పాస్‌వర్డ్‌లు, ఐటీ ఉద్యోగుల డేటాను సైతం చోరీ చేశారు. డిఫెన్స్‌, ఆర్మీ ఉద్యోగుల డేటా అంగట్లో అమ్మకానికి పెట్టారు. మహిళల వ్యక్తిగత డేటానూ సైబర్‌ నేరగాళ్లకు అమ్ముతున్నారు. ఇది దేశ భద్రతకు పెను ముప్పు. సైబరాబాద్‌ పరిధిలో ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నాం. ఈ వ్యవహారంలో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా క్రెడిట్‌ కార్డ్‌ జారీ చేసే ఓ ఏజెన్సీ ఉన్నట్లు గుర్తించాం. దీనికి సంబంధించి జస్ట్‌ డయల్‌ సంస్థపై కూడా కేసులు నమోదు చేస్తాం. గతంలో ఇలాంటి కేసులు మా దృష్టికి వచ్చాయి. వీరి వెనుక ఎవరున్నారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నాం. నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారిస్తాం’’ అని సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర తెలిపారు.

కేసు విచారణకు ప్రత్యేక బృందం ఏర్పాటు..

దేశంలో కోట్ల మంది వ్యక్తిగత డేటా, మొబైల్‌ నెంబర్లు, సైనిక అధికారుల వ్యక్తిగత డేటా చౌర్యం.. ఈ అంశం ప్రస్తుతం కలకలం రేపుతోంది. అసలు ఎంతో ముఖ్యమైన సమాచారం ఎలా బయటకు వచ్చింది? దీని వెనుక ఎవరెవరున్నారు? సైబర్‌ నేరగాళ్లు ఏ మేరకు డాటా దుర్వినియోగం చేశారు? తదితర అంశాలపై ప్రస్తుతం సైబరాబాద్‌ పోలీసులు దృష్టి సారించారు. కేసు విచారణకు అంతర్గతంగా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని సైబరాబాద్‌ పోలీసులు ఏర్పాటు చేశారు. జాయింట్‌ సీపీ కల్మేశ్వర్‌ ఆధ్వర్యంలో సిట్‌ పనిచేయనుంది. 

బ్యాంకుల నుంచి లోన్‌ తీసుకోవాలన్నా, క్రెడిట్‌ కార్డు పొందాలన్నా కేవైసీ ఎంతో కీలకం. ఈ కేవైసీ ద్వారానే డేటా చోరీ అయినట్టు పోలీసులు చెబుతున్నారు. ఇటువంటి డేటా బ్యాంకింగ్‌, టెలికాం సంస్థలు బయటకు రాకుండా ఎంతో జాగ్రత్తగా ఉంచాలి. వారి నిర్లక్ష్యం కారణంగా వ్యక్తిగత సమాచారం చోరీ అవుతోందని పోలీసులు వివరించారు. చోరీ అయిన డేటా సైబర్‌ నేరగాళ్ల చేతిలో పడుతోంది. సదరు నేరగాళ్లు తస్కరించిన డేటాను నేరాలకు ఉపయోగిస్తున్నట్టు భావిస్తున్నారు. దీనివల్ల సైబర్‌ నేరాలు, ఇతర నేరాలు పెరగడంతో పాటు జాతీయ భద్రతకు కూడా ముప్పు ఎదురయ్యే అవకాశం ఉందని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు.

డేటా తీసుకుంటున్నప్పుడు బ్యాంకింగ్‌, టెలికాం ఏ ఇతర సంస్థలైనా సరే దాన్ని భద్రతపరంగా పరిరక్షించాలి. ఆ బాధ్యత ఆయా సంస్థలదేనని సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర వివరించారు. డేటా ఏ విధంగా చోరీ అయింది ప్రధాన కారణమేంటి? అనే విషయాలపై సైబరాబాద్‌ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. సైనిక అధికారుల వ్యక్తిగత సమాచారం ఏ విధంగా బయటకు వెళ్లిందనే విషయంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు. వారి పేర్లు, ర్యాంకులు, ఇతర వివరాలు ఎలా ఈ ముఠాకు చిక్కాయనే విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ కేసులో మరింత లోతైన దర్యాప్తు అవసరం కాబట్టి అంతర్గతంగా సిట్‌ ఏర్పాటు చేసి విచారించనున్నారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపితే మరిన్ని అంశాలు బయటపడే అవకాశం ఉంది.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని