Delhi: ప్రాణం తీసిన మస్కిటో కాయిల్‌.. ఒకే కుటుంబంలో ఆరుగురి మృతి

దోమల బాధ నుంచి తప్పించుకునేందుకు మనలో చాలా మంది రాత్రిపూట ఇంట్లో మస్కిటో కాయిల్స్‌ (Mosquito Coil), మస్కిటో స్టిక్స్‌ వెలిగిస్తుంటాం. అలాంటి వారు తప్పక తెలుసుకోవాల్సిన వార్త ఇది..!

Updated : 31 Mar 2023 13:26 IST

దిల్లీ: దేశ రాజధాని దిల్లీ (Delhi)లో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. దోమల నివారణకు వెలిగించిన మస్కిటో కాయిల్‌ (Mosquito Coil) ఆరుగుర్ని బలితీసుకుంది. ఆ కాయిల్‌ కారణంగా మంటలు చెలరేగి, ఆ తర్వాత వెలువడిన విషపూరిత వాయువులను (Toxic Gas) పీల్చడంతో ఊపిరాడక ఒకే కుటుంబంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఏడాదిన్నర చిన్నారి కూడా ఉండటం మరింత విచారకరం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

ఈశాన్య దిల్లీలోని శాస్త్రి పార్క్‌ ప్రాంతంలో ఓ కుటుంబం నివాసముంటోంది. గురువారం రాత్రి దోమలను తరిమేందుకు వీరు మస్కిటో కాయిల్‌ను అంటించి పడుకున్నారు. అయితే రాత్రి సమయంలో ఈ కాయిల్‌ (Mosquito Coil).. పరుపుపై పడి మెల్లిగా అంటుకుని పొగ అలుముకుంది. అటు కిటికీలు, తలుపులు కూడా పూర్తిగా మూసి ఉన్నాయి. పరిస్థితిని గమనించి వారు బయటపడేందుకు ప్రయత్నించినా విషపూరిత వాయువులను పీల్చి వారు స్పృహతప్పి పడిపోయారు. శుక్రవారం ఉదయం వారి ఇంటి నుంచి మంటలు రావడం గమనించి స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు.

ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు బద్దలుకొట్టి లోపలికి వెళ్లారు. ప్రమాద సమయంలో ఇంట్లో మొత్తం 9 మంది ఉండగా.. వీరిలో ఆరుగురు విగతజీవులుగా కన్పించారు. మిగతా ముగ్గురిని పోలీసులు రక్షించి ఆసుపత్రికి తరలించారు. ‘‘రాత్రంతా విషవాయువులు పీల్చడంతో వారు స్పృహతప్పి పడిపోయారు. ఆ తర్వాత ఊపిరాడక ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు’’ అని స్థానిక పోలీసులు వెల్లడించారు. మృతుల్లో ఏడాదిన్నర వయసున్న చిన్నారి కూడా ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని