Snake bite: పాపను పాము కాటేసింది.. ఆయమ్మ కట్టుకట్టి నిద్రపుచ్చింది

నవ్వులు చిందిస్తూ ఉదయం ఇంటి నుంచి వెళ్లిన నాలుగేళ్ల చిన్నారి అంగన్‌వాడీ కేంద్రం వద్ద పాముకాటుకు గురై మృతి చెందిన ఘటన ఇది. పాముకాటుపై అవగాహన లేని ఆయమ్మ చేసిన నిర్వాకమూ చిన్నారి ప్రాణం పోయేందుకు కారణమైంది.

Updated : 26 Nov 2021 06:48 IST

అంగన్‌వాడీ కేంద్రంలో నాలుగేళ్ల చిన్నారి మృతి

నిత్యశ్రీ

గజ్వేల్‌, గ్రామీణ, న్యూస్‌టుడే: నవ్వులు చిందిస్తూ ఉదయం ఇంటి నుంచి వెళ్లిన నాలుగేళ్ల చిన్నారి అంగన్‌వాడీ కేంద్రం వద్ద పాముకాటుకు గురై మృతి చెందిన ఘటన ఇది. పాముకాటుపై అవగాహన లేని ఆయమ్మ చేసిన నిర్వాకమూ చిన్నారి ప్రాణం పోయేందుకు కారణమైంది. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ మండలం బయ్యారం గ్రామానికి చెందిన కామల్ల రాజు-సంతోష దంపతుల కుమార్తె నిత్యశ్రీ(4) ఏడాదిన్నరగా అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్తోంది. గురువారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో కేంద్రం ముందు ఆడుకుంటున్న నిత్యశ్రీ ఒక్కసారిగా కిందపడిపోయింది. ఎడమకాలు పాదం వద్ద రక్తం కారటాన్ని గమనించిన ఆయమ్మ ఢాకమ్మ గాయం వద్ద పసుపురాసి, కట్టుకట్టి కేంద్రంలో పడుకోబెట్టింది. కాసేపటి తర్వాత భోజనం పెట్టేందుకని చిన్నారిని లేపే ప్రయత్నం చేసింది. లేవకపోవడంతో కార్యకర్త అనిత చిన్నారి తల్లికి సమాచారం అందించింది. వారంతా పాపను హుటాహుటిన గజ్వేల్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు పాముకాటుతో చిన్నారి మృతి చెందినట్టు ధ్రువీకరించారు. అంగన్‌వాడీ కేంద్రం పక్కనే మురుగు కాల్వ, ప్రభుత్వ పాఠశాల ప్రహరీ ఉన్నాయి. మూత్ర విసర్జన కోసం ప్రహరీ వద్దకు వెళ్లిన సమయంలో పాము కాటేసి ఉంటుందనే అనుమానంతో స్థానికులు అక్కడ పరిశీలించారు. గోడ మధ్యలో రంధ్రాలను గుర్తించి తవ్వారు. రెండు నాగుపాము పిల్లలను గుర్తించి చంపేశారు. పాముకాటును ఆయమ్మ గుర్తించి ఉంటే చిన్నారి ప్రాణం పోకుండా ఉండేదని తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని