Andhra News: నెల్లూరులో యువతిని తుపాకీతో కాల్చి.. ఆపై తానూ కాల్చుకొని..

ల్లూరు జిల్లాలోని పొదలకూరులో దారుణం చోటుచేసుకుంది. యువతిపై యువకుడు తుపాకీతో కాల్పులు జరిపాడు. ఆ తర్వాత అదే తుపాకీతో తాను కూడా కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జిల్లాలోని పొదలకూరు మండలం తాటిపర్తిలో సోమవారం మధ్యాహ్నం చోచుచేసుకుంది....

Updated : 09 May 2022 20:25 IST

పొదలకూరు: నెల్లూరు జిల్లాలోని పొదలకూరులో దారుణం చోటుచేసుకుంది. యువతిపై యువకుడు తుపాకీతో కాల్పులు జరిపాడు. ఆ తర్వాత అదే తుపాకీతో తాను కూడా కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జిల్లాలోని పొదలకూరు మండలం తాటిపర్తిలో సోమవారం మధ్యాహ్నం చోచుచేసుకుంది.

ఎస్పీ విజయ్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ‘‘నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తికి చెందిన మాలపాటి సురేశ్‌రెడ్డి, పొలకూరు కావ్య సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. ఉద్యోగరీత్యా వీరిద్దరూ గతంలో బెంగళూరులో ఉండేవారు. ప్రస్తుతం వర్క్‌ఫ్రమ్‌ హోం కావడంతో స్వగ్రామం తాటిపర్తి నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రేమిస్తున్నాను.. పెళ్లి చేసుకుంటానని గత కొంతకాలంగా కావ్యను సురేశ్‌ ఇబ్బంది పెడుతూ వచ్చాడు. సురేశ్‌రెడ్డి వైపు నుంచి ఏకపక్షంగా ప్రేమ వ్యవహారం నడిచింది. కావ్యకు సురేశ్‌రెడ్డి ఫోన్లు చేస్తూ మేసేజ్‌లు పెట్టేవాడు. పెళ్లి చేసుకుంటానని గత నెల యువతి ఇంటికి తన తల్లిదండ్రులను పంపించాడు. పెళ్లి ప్రతిపాదనను కావ్య తల్లిదండ్రులు నిరాకరించారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల తర్వాత కావ్య ఇంటికి సురేశ్‌రెడ్డి వెళ్లాడు. అడ్డువచ్చిన కావ్య చెల్లెలిని తోసేసి కాల్పులు జరిపాడు. కావ్యపై సురేశ్‌ రెండు రౌండ్లు కాల్పలు జరిపాడు. తొలిసారి జరిపిన కాల్పుల నుంచి కావ్య తప్పించుకుంది. రెండో రౌండ్‌ కాల్పుల్లో కావ్య తల నుంచి తూటా దూసుకెళ్లింది. కావ్య శవపరీక్ష తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయి. తుపాకీపై మేడ్‌ ఇన్‌ యూఎస్‌ఏ అని ఉంది. నిందితుడికి తుపాకీ ఎలా వచ్చిందనే వివరాలను ఆరా తీస్తున్నాం. సురేశ్‌కి చెందిన 2 సెల్‌ఫోన్లను సీజ్‌ చేశాం. సెల్‌ఫోన్‌ వివరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నాం’’ అని ఎస్పీ వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని