జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం

జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా సొపోర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబా ఉగ్రముఠాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను భారత భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.

Updated : 22 Aug 2022 15:56 IST

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా సొపోర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబా ఉగ్రముఠాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను భారత భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఆదివారం సాయంత్రం ప్రారంభమైన ఎదురుకాల్పులు రాత్రంతా కొనసాగాయని కశ్మీర్‌ డీజీ దిల్‌బాగ్‌ సింగ్‌ వెల్లడించారు. ఎన్‌కౌంటర్‌ జరిగిన స్థలం నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కశ్మీర్‌ పోలీసులు చాలాకాలంగా గాలిస్తున్న ముదాసిర్‌ పండిట్‌ అనే కమాండర్‌ స్థాయి ఉగ్రవాది ఈ ఎన్‌కౌంటర్‌లో హతమైనట్లు చెప్పారు. పలువురి హత్యల్లో అతడి ప్రమేయం ఉన్నట్లు స్పష్టం చేశారు. ఎన్‌కౌంటర్‌లో హతులైన మరో ఇద్దరు కూడా లష్కరే తోయిబాలో కమాండర్‌ స్థాయి ఉగ్రవాదులేనని తెలిపారు. వారిలో ఒకరిని ఖుర్షీద్‌ అహ్మద్‌ మిర్‌, మరొకరిని విదేశీ ఉగ్రవాదిగా గుర్తించినట్లు పేర్కొన్నారు. సొపోర్‌కు చెందిన ఖుర్షీద్‌ అహ్మద్‌ మిర్..  మే, 2020 నుంచి లష్కరే తోయిబాలో పనిచేస్తున్నట్లు వెల్లడించారు. అతడు ఏడుగురు భద్రతాదళ సిబ్బంది, అయిదుగురు స్థానికులను హత్య చేసినట్లు తెలిపారు. ముదాసిర్‌ పండిట్‌తో కలిసి పలు హత్యలు, ఉగ్రదాడుల్లో పాల్గొన్నాడని వివరించారు.

 మూడు నెలల్లో రెండు భారీ ఉగ్రదాడులు సంభవించడంతో సొపోర్‌లో వారి ఫొటోలతో పోస్టర్లు అతికించినట్లు కశ్మీర్‌ ఐజీ బిజయ్‌ కుమార్‌ తెలిపారు. వారి గురించి సమాచారం ఇచ్చిన వారికి బహుమతులు కూడా ప్రకటించామన్నారు. దీంతో స్థానికులు పెద్ద సంఖ్యలో తమకు ఫోన్లు చేసి సమాచారం అందించారని తెలిపారు. ఈ సందర్భంగా స్థానికులకు కృతజ్ఞతలు చెప్పారు.    


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని