Crime: మద్యం సేవించి.. దంపతులను కారుతో ఢీ కొట్టి!

యువత మద్యం మత్తులో వాహనాలు నడిపిస్తూ అమాయకుల ప్రాణాలు బలితీసుకుంటున్న సంఘటనలు తరచుగా జరుగుతున్నాయి.

Updated : 07 Jul 2024 18:00 IST

ముంబయి: పుణె కారు ప్రమాద ఘటన మరవక ముందే ముంబయిలో అదే తరహాలో మరో ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఓ బీఎండబ్ల్యూ కారు స్కూటీని ఢీకొట్టడంతో మహిళ మృతి చెందారు. ప్రమాదానికి కారణమైన కారు.. మహారాష్ట్రలోని పాల్ఘర్‌ జిల్లా శివసేన నేత రాజేష్‌ షాకు చెందినదిగా పోలీసులు గుర్తించారు. నిందితుడిని షా కుమారుడు 24 ఏళ్ల మిహిర్‌ షాగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం ముంబయిలోని వర్లీ ప్రాంతంలో మిహిర్‌ మద్యం మత్తులో బీఎండబ్ల్యూ కారును వేగంగా నడుపుతూ ముందు వెళ్తున్న స్కూటర్‌ను ఢీకొట్టాడు. దీంతో స్కూటర్‌ పై ఉన్న మహిళ అక్కడికక్కడే  ప్రాణాలు కోల్పోయారు. నిందితుడు పరారీలో ఉండటంతో అతడి తండ్రితోపాటు, ప్రమాదం జరిగినప్పుడు కారులోనే ఉన్న డ్రైవర్‌ను పోలీసులు కస్టడీలోకి తీసుకొని కేసు నమోదు చేశారు. కాగా, ఘటన అనంతరం నిందితులు సాక్ష్యాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నించినట్లుగా పోలీసులు తెలిపారు. కారు విండ్‌ షీల్డ్‌పై ఉన్న శివసేన స్టిక్కర్‌ను తొలగించడానికి ప్రయత్నించినట్లుగా పేర్కొన్నారు. కారు నెంబర్‌ ప్లేట్లలో ఒకదానిని తొలగించారన్నారు.

నిందితుడు శనివారం రాత్రి ఓ బార్‌లో మద్యం సేవించాడు. తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో తనను లాంగ్‌ డ్రైవ్‌కు తీసుకెళ్లాలని డ్రైవర్‌ను కోరాడు. కారు వర్లీకి చేరుకున్న అనంతరం డ్రైవ్ చేస్తానని పట్టుబట్టి డ్రైవర్‌ సీటులోకి మారాడు. మద్యం మత్తులో కారును వేగంగా నడపడంతో అది ముందు వెళ్తున్న స్కూటర్‌ను ఢీకొంది. దీంతో స్కూటీపై ఉన్న దంపతులు ఎగిరి పడ్డారు. వేగంగా వెళ్తున్న కారు మహిళపై నుంచి దూసుకెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. ఆమె భర్తకు స్వల్ప గాయాలయ్యాయి.  బాధితులను కావేరి నక్వా, ఆమె భర్త ప్రదిక్ నక్వాలుగా పోలీసులు గుర్తించారు. చేపలు అమ్ముకుంటూ జీవిస్తున్న ఈ దంపతులు చేపలు కొనుగోలు చేసేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే స్పందించారు. చట్టం ముందు అందరూ సమానమేనని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.  ఇటీవల పుణెలో ఓ టీనేజర్ ర్యాష్‌ డ్రైవింగ్‌ కారణంగా ఇద్దరు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు మృతి చెందిన సంఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని