Crime News: అస్సాంలో ఒంగోలు అధ్యాపకుడి హత్య.. తరగతి గదిలో కత్తితో పొడిచిన విద్యార్థి

విద్యాబుద్ధులు నేర్పిన గురువును తరగతి గదిలోనే కడతేర్చాడో విద్యార్థి. అస్సాంలో జరిగిన ఈ దారుణ ఘటనలో ప్రకాశం జిల్లాకు చెందిన రాజేశ్‌బాబు ప్రాణాలు కోల్పోయారు.

Published : 09 Jul 2024 04:50 IST

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: విద్యాబుద్ధులు నేర్పిన గురువును తరగతి గదిలోనే కడతేర్చాడో విద్యార్థి. అస్సాంలో జరిగిన ఈ దారుణ ఘటనలో ప్రకాశం జిల్లాకు చెందిన రాజేశ్‌బాబు ప్రాణాలు కోల్పోయారు. ఒంగోలు నగరం అన్నవరప్పాడుకు చెందిన బెజవాడ రాజేశ్‌బాబు రసాయన శాస్త్రం అధ్యాపకుడు. విశాఖలోని ఓ ప్రైవేటు కళాశాలలో దాదాపు పదేళ్లు పనిచేశారు. తర్వాత మిత్రులతో కలిసి అస్సాంలోని శివసాగర్‌ ప్రాంతంలో సొంతంగా కళాశాల నెలకొల్పారు. పదమూడేళ్లుగా ఆయన ప్రిన్సిపల్‌గా వ్యవహరిస్తుండగా, భార్య అపర్ణ డైరెక్టర్‌గా ఉన్నారు. కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థికి గణితంలో మార్కులు తక్కువగా రావడంతో పాటు అతడి ప్రవర్తన సైతం సరిగా లేకపోవడంతో గణిత అధ్యాపకుడు శనివారం మందలించారు. ఇంటికెళ్లి పెద్దలను తీసుకురావాలని చెప్పారు.

ఆ సమయంలో ప్రిన్సిపల్‌ రాజేశ్‌బాబు అక్కడే ఉన్నారు. దీన్ని అవమానంగా భావించిన ఆ విద్యార్థి కక్ష పెంచుకున్నాడు. సాయంత్రం తన వెంట ఓ కత్తి తెచ్చుకుని తరగతి గదిలో కూర్చున్నాడు. రాజేశ్‌బాబు కెమిస్ట్రీ క్లాస్‌ చెబుతుండగా, ఒక్కసారిగా కత్తితో దాడి చేశాడు. తల, ఛాతీపై పొడవడంతో తీవ్ర గాయాలయ్యాయి. కళాశాల సిబ్బంది బాధితుడిని వైద్యశాలకు తీసుకెళ్లేలోపే ప్రాణాలు కోల్పోయారు. రాజేశ్‌బాబు దంపతులకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆయన భౌతిక కాయాన్ని సోమవారం ఒంగోలుకు తీసుకువచ్చి అంత్యక్రియలు పూర్తిచేశారు. ‘దాడికి పాల్పడ్డ విద్యార్థి తండ్రి చనిపోయాడు. తల్లి మాత్రమే ఉంది. తండ్రికి నేరచరిత్ర ఉన్నట్లు తర్వాత తెలిసింద’ని మృతుడి సోదరుడు నవీన్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు