USA: వడదెబ్బతో విద్యార్థి మృతి.. కుటుంబానికి రూ.110 కోట్ల నష్ట పరిహారం

రెజ్లింగ్‌ విషయంలో కోచ్‌లు కఠినంగా వ్యవహరించిన పాపానికి 20 ఏళ్ల యువకుడు బలయ్యాడు. నిర్లక్ష్యానికి బాధ్యత వహిస్తూ బాధిత కుటుంబానికి అతడు చదివే యూనివర్సిటీ రూ.100 కోట్ల పైనే పరిహారం చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది.

Updated : 28 Mar 2023 01:13 IST

వాషింగ్టన్‌: వడదెబ్బ కారణంగా మృతి చెందిన ఓ విద్యార్థి కుటుంబానికి అమెరికా యూనివర్సిటీ ఒకటి భారీ పరిహారం చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. తమ కుమారుడి మరణానికి అమెరికాలోని యూనివర్సిటీ యాజమాన్యమే కారణమంటూ బాధిత కుటుంబం ఆరోపించింది. దీంతో సదరు యూనివర్సిటీ 14 మిలియన్‌ డాలర్ల( భారత కరెన్సీలో రూ.110 కోట్లు) పరిహారం చెల్లించేందుకు అంగీకరించింది.

అమెరికాలోని కెంటకీ విశ్వవిద్యాలయంలో 2020లో రెజ్లింగ్‌కు సంబంధించి శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఇందులో బ్రేస్‌ అనే 20 ఏళ్ల యువకుడు పాల్గొన్నాడు. అయితే, శిక్షణలో అలసిపోయిన బ్రేస్‌ అస్వస్థతకు గురయ్యాడు. దాహం తీర్చుకోవడం కోసం అక్కడున్నవారిని అభ్యర్థించాడు. అందుకు అక్కడున్న కోచ్‌లు నిరాకరించారు. శిక్షణలో భాగం అంటూ ఇంకెవరూ అతడికి నీటిని ఇవ్వకుండా అడ్డుకున్నారు. దీంతో డీహైడ్రేషన్‌కు గురైన బ్రేస్‌ కాసేపటికే మరణించాడు. తన కుమారుడి మరణానికి యూనివర్సిటీ యాజమాన్యమే కారణమంటూ బ్రేస్‌ కుటుంబ సభ్యులు కోర్టులో దావా వేశారు. తమ కుమారుడి పట్ల కఠినంగా వ్యవహరించడం వల్లే అతడు మరణించాడని పేర్కొన్నారు. దీంతో బాధిత కుటుంబానికి 14 మిలియన్‌ డాలర్లు  చెల్లించేందుకు యూనివర్సిటీ ముందుకొచ్చింది. ‘బ్రేస్‌ అకాల మరణానికి చింతిస్తున్నాం. అతడి కుటుంబానికి పరిహారం చెల్లించాలని నిర్ణయించాం. ఈ కేసు పరిష్కారంతో వారికి శాంతి, స్వస్థత చేకూరుతుందని ఆశిస్తున్నాం’ అని యూనివర్సిటీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఆ రోజు సెషన్‌లో పాల్గొన్న ఇద్దరు కోచ్‌లు రాజీనామా చేసినట్లు యూనివర్సిటీ తెలిపింది.

 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని