Crime News: మహిళా కానిస్టేబుల్‌పై అత్యాచారం.. ఉద్యోగం నుంచి కీచక ఎస్సై తొలగింపు

సమాజానికి రక్షణ కల్పించాల్సిన స్థానంలో ఉండి.. తోటి ఉద్యోగినిపైనే అత్యాచారానికి ఒడిగట్టి పోలీసు శాఖ ప్రతిష్ఠకు మచ్చ తెచ్చాడో ఎస్సై.

Updated : 20 Jun 2024 07:29 IST

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఘటన
గతంలోనూ మహిళలను వేధించాడన్న అభియోగాలు

ఈనాడు డిజిటల్, జయశంకర్‌ భూపాలపల్లి, కాళేశ్వరం, న్యూస్‌టుడే: సమాజానికి రక్షణ కల్పించాల్సిన స్థానంలో ఉండి.. తోటి ఉద్యోగినిపైనే అత్యాచారానికి ఒడిగట్టి పోలీసు శాఖ ప్రతిష్ఠకు మచ్చ తెచ్చాడో ఎస్సై. గతంలోనూ మహిళలను లైంగికంగా వేధించిన సంఘటనలు ఉండడంతో ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి.. అతడిని ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగించింది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలం కాళేశ్వరం ఎస్సై భవానీ సేన్‌ ఓ మహిళా హెడ్‌ కానిస్టేబుల్‌పై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాళేశ్వరంలో లక్ష్మీ పంప్‌హౌస్‌ సమీపంలోని పాత పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో తమకు కేటాయించిన గదుల్లో పోలీసులు నివసిస్తున్నారు. ఈ నెల 15న ఆ మహిళా హెడ్‌కానిస్టేబుల్‌ విధులు ముగించుకుని రాత్రి 10 గంటలకు తన గదికి వెళ్లారు. అదే భవనం రెండో అంతస్తులో నివసిస్తున్న భవానీసేన్‌ రాత్రి ఒంటి గంట దాటిన తర్వాత కిటీకీని తొలగించి ఆమె గదిలోకి ప్రవేశించాడు. ఆమె ప్రతిఘటించగా.. సర్వీసు రివాల్వర్‌తో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. భయభ్రాంతులకు గురైన ఆమె.. తన భర్తతో చర్చించి మంగళవారం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో భవానీసేన్‌పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దాదాపు 20 రోజుల కిందట కూడా కాలు జారి కింద పడిపోయానంటూ ఎస్సై ఆమెను తన గదికి పిలిపించుకుని అత్యాచారయత్నం చేయబోగా.. ఆమె తప్పించుకున్నట్లు తెలిసింది. 

ఎస్సై అరెస్టు.. రిమాండ్‌

జిల్లా ఎస్పీ కిరణ్‌ ఖరే ఈ ఉదంతంపై ఎస్డీపీవో సంపత్‌రావుతో విచారణ చేయించారు. ఇందుకోసం ముగ్గురు డీఎస్పీలు, ఐదుగురు సీఐలు, భారీ బందోబస్తు మధ్య విచారణ చేసినట్లు సమాచారం. ఎస్సై వద్ద ఉన్న సర్వీసు రివాల్వర్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. మంగళవారం రాత్రి 1.30 గంటల సమయంలో భవానీసేన్‌ను అదుపులోకి తీసుకున్నారు. బుధవారం ఉదయం భూపాలపల్లి ఫస్ట్‌ క్లాస్‌ అడిషనల్‌ జేఎఫ్‌సీఎం కోర్టులో హాజరుపర్చారు. కోర్టు రిమాండ్‌ విధించడంతో అతడిని కరీంనగర్‌ జైలుకు తరలించారు.

సర్వీసు నుంచి శాశ్వతంగా ఉద్వాసన 

ఎస్సై భవానీ సేన్‌ను సర్వీసు నుంచి శాశ్వతంగా తొలగిస్తూ.. మల్టీజోన్‌-1 ఐజీ ఏవీ రంగనాథ్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2022 జులైలో ఆసిఫాబాద్‌ జిల్లా రెబ్బెన ఎస్సైగా ఉన్న సమయంలోనూ భవానీసేన్‌ ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడటంతో అక్కడ కూడా కేసు నమోదైంది. అప్పట్లో అతడిని సస్పెండ్‌ చేశారు. గతంలో మరో ముగ్గురు మహిళా కానిస్టేబుళ్లపై కూడా లైంగిక దాడులకు పాల్పడినట్లు అతడిపై ఆరోపణలు వచ్చాయి. వీటన్నిటి నేపథ్యంలో.. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 311 ప్రకారం భవానీసేన్‌ను ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగించినట్లు ఐజీ పేర్కొన్నారు. 

ఎవరైనా ఉపేక్షించం: మంత్రి శ్రీధర్‌బాబు

అత్యాచారం ఘటన విషయంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పందించారు. ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని