Agnipath Protest: సికింద్రాబాద్‌ అల్లర్ల కేసు... గుట్టువీడిన సుబ్బారావు పాత్ర

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌పై దాడి కేసులో సాయి డిఫెన్స్‌ అకాడమీ డైరెక్టర్‌ సుబ్బారావు పాత్రపై రైల్వే పోలీసులు పక్కా ఆధారాలు సేకరించారు.

Updated : 24 Jun 2022 00:17 IST

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌పై దాడి కేసులో సాయి డిఫెన్స్‌ అకాడమీ డైరెక్టర్‌ సుబ్బారావు పాత్రపై రైల్వే పోలీసులు పక్కా ఆధారాలు సేకరించారు. స్టేషన్‌లో విధ్వంసం సృష్టించాలన్న ప్రణాళిక, కార్యచరణను సుబ్బారావు దగ్గరుండి పర్యవేక్షించినట్టు పోలీసులకు సాక్ష్యాలు లభించాయి. జూన్‌ 16న సుబ్బారావు తన అనుచరులతో గుంటూరు నుంచి హైదరాబాద్‌ చేరుకుని సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలోని ఓ హోటల్‌లో దిగాడు. తన ముఖ్య అనుచరులు శివ, మల్లారెడ్డితో  మాట్లాడి... వారి ద్వారా ఆర్మీ అభ్యర్థులను  రప్పించుకుని ఆ రోజు రాత్రి సమాలోచనలు జరిపారు. మూకుమ్మడిగా రైల్వేస్టేషన్‌లోకి వెళ్లి దాడులు చేయాలని సూచించాడు. వారికి మద్దతుగా తన అనుచరులను మాస్కులతో రైల్వేస్టేషన్‌కు పంపించాడు. ఆర్మీ అభ్యర్థులు విధ్వంసం మొదలుపెట్టిన కొద్దిసేపటికే గుంటూరుకు పారిపోయాడని రైల్వే పోలీసులు గుర్తించారు. 

రైల్వేస్టేషన్‌పై దాడి కేసులో సుబ్బారావు ప్రమేయం ఉందని ముందు నుంచీ రైల్వే పోలీసులు అనుమానించారు. అతడిని పట్టుకునేందుకు ఈ నెల 19న గుంటూరుకు వెళ్లారు. తనకు విధ్వంసానికి ఎటువంటి సంబంధం లేదని బుకాయించాడు. దీంతో కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని, తమతోపాటు రావాలని హైదరాబాద్‌ తీసుకొచ్చారు.  బుధవారం ఉదయం రైల్వే పోలీసులు ప్రశ్నించినా తనకేం సంబంధంలేదని చెప్పుకొచ్చాడు. సుబ్బారావు అనుచరులు శివ, మల్లారెడ్డి, మరో ముగ్గురిని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు  అదుపులోకి తీసుకున్నారు. వారిని రైల్వే పోలీసులకు అప్పగించగా... ‘‘సుబ్బారావుకు రైల్వే విధ్వంసానికి సంబంధం ఉంది. మాకు కొన్ని పనులు అప్పగించాడని’’ వారు రైల్వేపోలీసులకు తెలిపారు. దీంతో గురువారం అర్ధరాత్రి సుబ్బారావు, అతడి అనుచరులను రహస్య ప్రాంతానికి తరలించి విచారిస్తున్నారు. శుక్రవారం అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరచనున్నట్టు విశ్వసనీయ సమాచారం.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని