భార్యపై అనుమానం.. నవజాత శిశువుకు విషమెక్కించిన తండ్రి

భార్యపై అనుమానంతో 20 రోజుల క్రితం జన్మించిన శిశువుకు ఓ తండ్రి విషం ఎక్కించాడు. ప్రస్తుతం ఆ చిన్నారి చావుబతుకుల మధ్య కొట్టిమిట్టాడుతోంది.

Published : 31 May 2023 01:15 IST

బాలాసోర్‌: అనుమానం పెను భూతమైంది. నిండు ప్రాణాన్ని చావుబతుకుల మధ్యకు నెట్టేసింది. భార్య వివాహేతర సంబంధం (Extramarital affair), పెట్టుకుందన్న అనుమానంతో.. 20 రోజుల క్రితం జన్మించిన బిడ్డకు ఓ తండ్రి విషం ఎక్కించాడు. ప్రస్తుతం ఆ చిన్నారి మృత్యువుతో పోరాడుతోంది. ఈ ఘటన ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగింది. ఎస్పీ సాగరిక నాథ్‌ వెల్లడించిన వివరాల ప్రకారం.. నిందితుడు చందన్‌కు తన్మయి అనే యువతితో ఏడాది క్రితం వివాహమైంది. వీరికి మే 9న ఆడపిల్ల జన్మించింది. అయితే, తన భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని, అతడి వల్లే గర్భం దాల్చిందని అనుమానించిన చందన్‌.. ఆ శిశువును హతమార్చాలని భావించాడు. 

ప్రసవం అనంతరం రెండు వారాల తర్వాత స్థానిక ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జయిన తన్మయి తన పుట్టింటికి వెళ్లింది. దీంతో భార్యబిడ్డలను చూసేందుకు సోమవారం అక్కడికి వెళ్లిన చందన్.. భార్య లేని సమయంలో పురుగులమందును సిరంజి ద్వారా చిన్నారి శరీరంలోకి ఎక్కించేందుకు ప్రయత్నించాడు. దీంతో ఒక్కసారిగా ఆ శిశువు ఏడుపు మొదలు పెట్టింది. పక్క గదిలో ఉన్న తల్లి.. వచ్చి చూసేసరికి చందన్‌ చేతిలో సిరంజి, ఆ పక్కనే పురుగుల మందు సీసా కనిపించాయి. ఆమె నిలదీయగా తానేమీ చేయలేదని బుకాయించాడు. వెంటనే ఆమె తన తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో హుటాహుటిన బాలాసోర్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ సాగరిక నాథ్‌ తెలిపారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని