IPS Officer: విచారణలో మర్మాంగాలపై దాడి.. ఐపీఎస్ అధికారిపై వేటు!

ఓ కేసు విచారణలో భాగంగా నిందితులను తీవ్ర వేధింపులకు గురిచేసిన ఐపీఎస్‌ అధికారిపై తమిళనాడు ప్రభుత్వం చర్యలకు ఆదేశించింది. ఇటీవలి కాలంలో తమిళనాడులో కస్టడీ మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వాటిని అరికట్టే దిశగా చర్యలు చేపట్టింది. 

Published : 29 Mar 2023 23:50 IST

చెన్నై: నేర విచారణలో భాగంగా ఆరోపణ ఎదుర్కొంటున్న వారిని తీవ్ర వేధింపులకు గురిచేసిన ఐపీఎస్ అధికారి (IPS Officer)పై తమిళనాడు (TamilNadu) ప్రభుత్వం వేటు వేసింది. ఈ మేరకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) అసెంబ్లీలో ప్రకటన చేశారు. రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా స్టాలిన్ స్పష్టం చేశారు. న్యాయ విచారణ అనంతరం సదరు అధికారిపై పూర్తిస్థాయి చర్యలు ఉంటాయని తెలిపారు. ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే..

తమిళనాడులోని తిరునల్వేలి (Tirunelveli) జిల్లా అంబాసముద్రంలో 2020 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి బల్వీర్ సింగ్‌ అసిస్టెంట్ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. పది రోజుల క్రితం ఓ దాడి కేసులో నిందితులుగా ఉన్న ఐదుగురు వ్యక్తులు విచారణలో ఏఎస్పీ తమని తీవ్రంగా వేధించారని ఆరోపించారు. ఏఎస్పీ కటింగ్‌ప్లేర్‌తో తమ పళ్లను పీకడంతోపాటు, తమలో కొత్తగా వివాహమైన ఓ వ్యక్తి మర్మాంగాలపై దాడి చేశారని సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసిన వీడియోలో పేర్కొన్నారు. మర్మాంగాలపై దాడికి గురైన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. వీడియో వైరల్‌ కావడంతో ఘటనపై జిల్లా కలెక్టర్‌ న్యాయ విచారణకు ఆదేశించారు. విచారణ ముగిసేవరకు ఆయన్ను విధుల నుంచి సస్పెండ్ చేశారు. అయితే, ప్రజా సంఘాలు, సామాజిక కార్యకర్తలు మాత్రం ఏఎస్పీపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవలి కాలంలో తమిళనాడులో కస్టడీ మరణాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో సీసీటీవీ పర్యవేక్షణలో నేరస్తుల విచారణ జరగాలని కోర్టు ఆదేశించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని