Murder: తాడిపత్రిలో తెదేపా కార్యకర్త హత్య

అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెదేపా కార్యకర్త ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. ఇటీవల ఎన్నికల సందర్భంగా జరిగిన అల్లర్ల నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న తాడిపత్రి ప్రజలు ఈ హత్యతో మళ్లీ ఉలిక్కిపడ్డారు.

Published : 18 Jun 2024 05:03 IST

మేడపై నిద్రిస్తుండగా వేట కొడవళ్లతో దాడి
వైకాపా మూకల పనేనని కుటుంబసభ్యుల ఆరోపణ

ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న డీఎస్పీ జనార్దననాయుడు

తాడిపత్రి, న్యూస్‌టుడే: అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెదేపా కార్యకర్త ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. ఇటీవల ఎన్నికల సందర్భంగా జరిగిన అల్లర్ల నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న తాడిపత్రి ప్రజలు ఈ హత్యతో మళ్లీ ఉలిక్కిపడ్డారు. పట్టణంలోని నందలపాడుకాలనీకి చెందిన మహబూబ్‌బాషా, రమీజాల కుమారుడు లాలూ బాషా(23) ఆదివారం రాత్రి తన ఇంటి మేడపై పడుకున్నారు. సోమవారం ఉదయం 6.30కు అతని నాన్నమ్మ మేడపైకి వెళ్లి చూడగా లాలూ రక్తపు మడుగులో విగతజీవిగా కనిపించాడు. భయభ్రాంతులకు గురైన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారమిచ్చారు. మెకానిక్‌ పని చేసుకుంటూ జీవనం సాగించే లాలూ బాషా ముందు నుంచీ తెదేపా సానుభూతిపరుడిగా ఉన్నారు. ఇటీవలి ఎన్నికల్లోనూ తెదేపా విజయానికి చురుగ్గా పనిచేశారు. ఈ కారణంతోనే అతనిపై అక్కసు పెంచుకున్న వైకాపా నాయకులు ఈ దారుణానికి ఒడిగట్టారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. 2021లో అప్పటి వైకాపా నాయకులు లాలూను ఓ పరిశ్రమలో నిర్బంధించి హింసించడంతో పాటు, తిరిగి అతనిపైనే కేసు పెట్టించారని తెలిపారు. ఎన్నికల్లో తెదేపా కోసం పనిచేసిన కారణంగానే కాలనీలోని కొందరు ఆకతాయిలు వైకాపా నాయకుల అండతో హత్య చేశారని వాపోయారు. పాత కక్షల నేపథ్యంలో లాలూ బాషా హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. లాలూకు కాలనీలోని కొందరితో విభేదాలున్నాయని, వారితో పలుమార్లు గొడవ పడిన ఘటనలపై 2021, 2022 సంవత్సరాల్లో అతనిపై మూడు హత్యాయత్నం కేసులు నమోదయ్యాయని చెబుతున్నారు. పోలీసులు అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.


లాలూ బాషా

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని