Guntur: కాల్పుల్లో గాయపడిన తెదేపా నేత బాలకోటిరెడ్డి మృతి

గుంటూరులోని ప్రైవేటు ఆసుపత్రిలో 20 రోజులుగా మృత్యువుతో పోరాడిన తెదేపా నేత బాలకోటిరెడ్డి ఇవాళ సాయంత్రం చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

Published : 21 Feb 2023 21:21 IST

గుంటూరు: కాల్పుల్లో గాయపడిన పల్నాడు జిల్లా రొంపిచర్ల మండల తెదేపా అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ వెన్నా బాలకోటిరెడ్డి మృతి చెందారు. గుంటూరులోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 20 రోజులుగా మృత్యువుతో పోరాడుతున్న ఆయన ఇవాళ సాయంత్రం తుదిశ్వాస విడిచారు. రొంపిచర్ల మండలంలోని అలవాల గ్రామంలో ఫిబ్రవరి ఒకటో తేదీ రాత్రి బాలకోటిరెడ్డి ఇంట్లో ఉండగా తుపాకీతో నిందితులు రెండురౌండ్లు కాల్పులు జరపగా ఆయన తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం నరసరావుపేటలోని ఓ ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు చేర్పించారు. వైద్యులు శస్త్రచికిత్స చేసి బుల్లెట్‌ను బయటకు తీశారు. ఆరోగ్యం క్షీణించడంతో ఆయనను శుక్రవారం ఉదయం హుటాహుటిన గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఐసీయూలో చికిత్స పొందుతూ కన్ను మూశారు.

బాలకోటిరెడ్డి తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా ఉన్నారు. మండల తెదేపా అధ్యక్షుడిగా, ఎంపీపీగా, గ్రామ సర్పంచిగా పని చేశారు. మాజీ సభాపతి కోడెల శివప్రసాద్‌కి నమ్మిన బంటుగా పేరుంది. అదే ఒరవడిలో మండలంలో తెదేపా అభివృద్ధికి తన వంతు  కృషి చేశారు. అలవాల పంచాయతీ ఎన్నికల సమయంలో తెదేపా, వైకాపా హోరాహోరీగా తలపడ్డాయి. ఈ ఎన్నికల్లో వైకాపా బలపర్చిన అభ్యర్థి విజయం సాధించారు. ఆ తరువాత గ్రామంలో వైకాపా, తెదేపాలో వర్గపోరు మొదలైంది. ఈ వర్గపోరుకి అలవాల తిరునాళ్ల మరింత అజ్యం పోసింది. తెదేపాలో రెండు వర్గాలు రెండు ప్రభలను, వైకాపాకు చెందిన రెండు వర్గాలు రెండు ప్రభలు కట్టారు. ప్రభల వద్దకు ఇరు పార్టీల నేతలు వచ్చిన క్రమంలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. అది కాస్తా పార్టీ రంగు పులుముకొని వివాదాలకు దారి తీసింది. పార్టీల పరంగా వివాదాలు సద్దుమణిగినా ఆధిపత్య పోరు మాత్రం కొనసాగుతూనే ఉంది. ఈ ఆధిపత్య పోరులో భాగంగానే ఆరు నెలల వ్యవధిలో మండల పార్టీ అధ్యక్షుడు వెన్నా బాలకోటిరెడ్డిపై రెండుసార్లు దాడులు జరిగాయి. చివరికి కాల్పుల్లో తీవ్రంగా గాయపడి తుదిశ్వాస విడిచారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని