
Crime News: గుంటూరు జిల్లాలో తెదేపా నేత దారుణ హత్య
గుంటూరు: గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని వెల్దుర్తి మండలం గుండ్లపాడులో తెలుగుదేశం పార్టీ నాయకుడు తోట చంద్రయ్య (36) ప్రత్యర్థుల చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన తెదేపా నేత చంద్రయ్య, రాజకీయ ప్రత్యర్థుల మధ్య గత కొన్ని రోజులుగా వివాదాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో చంద్రయ్యపై కోపం పెంచుకున్న ప్రత్యర్థులు అతని అడ్డుతొలగించుకోవాలని భావించారు. ఈ క్రమంలోనే చంద్రయ్య పని నిమిత్తం గురువారం ఉదయం 7గంటల సమయంలో ఇంటి నుంచి ద్విచక్ర వాహనంపై బయలుదేరి వెళ్లాడు. అప్పటికే అతని కోసం వేచి చూస్తున్న ప్రత్యర్థులు పథకం ప్రకారం బైక్కు కర్ర అడ్డు పెట్టి కిందపడేలా చేశారు. అనంతరం అతనిపై కత్తులు, కర్రలతో దాడి చేసి హతమార్చారు.
ఘటన నేపథ్యంలో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న మాచర్ల పోలీసులు అక్కడికి చేరుకొని ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా గస్తీ ఏర్పాటు చేశారు. కాగా, గ్రామంలో ఆదిపత్య పోరుకోసమే ఈ హత్యకు పాల్పడి ఉంటారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కేవలం 2 కి.మీ. దూరంలో ఉన్న ప్రాంతానికి హత్య జరిగిన 2 గంటల తర్వాత పోలీసులు రావడంపై చంద్రయ్య కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోస్టుమార్టం కోసం చంద్రయ్య మృతదేహాన్ని తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేశారు. అయితే బ్రహ్మారెడ్డి వచ్చే వరకు మృతదేహాన్ని తరలించే ప్రసక్తే లేదంటూ కుటుంబసభ్యులు తేల్చిచెప్పారు.
గుండ్లపాడుకు చంద్రబాబు..
ఇవాళ మధ్యాహ్నం తెదేపా అధినేత చంద్రబాబు చంద్రయ్య స్వగ్రామం గుండ్లపాడుకు రానున్నారు. చంద్రయ్యకు నివాళులర్పించి కుటుంబసభ్యులను పరామర్శించనున్నారు.