చనిపోయిందనుకొని అంత్యక్రియలు చేస్తే.. 11 ఏళ్లకి తిరిగొచ్చింది!

ఓ వివాహిత మానసిక స్థితి సరిగా లేక 11 ఏళ్ల కిందట కనిపించకుండా వెళ్లిపోయింది. చనిపోయిందని భావించి, కుటుంబసభ్యులు అంత్యక్రియలు కూడా చేసేశారు. ఇన్నేళ్ల తర్వాత ఆమె తమిళనాడులో ఉన్నట్లు సమాచారం అందడంతో వెళ్లి తీసుకొచ్చారు.

Updated : 25 Aug 2021 08:13 IST

మెట్‌పల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: ఓ వివాహిత మానసిక స్థితి సరిగా లేక 11 ఏళ్ల కిందట కనిపించకుండా వెళ్లిపోయింది. చనిపోయిందని భావించి, కుటుంబసభ్యులు అంత్యక్రియలు కూడా చేసేశారు. ఇన్నేళ్ల తర్వాత ఆమె తమిళనాడులో ఉన్నట్లు సమాచారం అందడంతో వెళ్లి తీసుకొచ్చారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం జగ్గాసాగర్‌ గ్రామానికి చెందిన నర్సయ్య, రెంజర్ల లక్ష్మి (48)లకు ముగ్గురు కుమార్తెలు. భర్త గల్ఫ్‌లో ఉండగా, 11 ఏళ్ల కిందట లక్ష్మి అదృశ్యమైంది. అప్పటి నుంచీ వెతికినా ఫలితం లేదు. రెండేళ్ల తర్వాత నిజామాబాద్‌ జిల్లా కమ్మర్‌పల్లి మండలం కోనాపూర్‌ అటవీ ప్రాంతంలో ఓ మహిళ శవం కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది. దుస్తులను చూసి లక్ష్మివేనని భావించి, కుటుంబసభ్యులు అంత్యక్రియలు పూర్తి చేశారు. ఇంటి నుంచి వెళ్లిపోయిన లక్ష్మి తమిళనాడులోని పెరంబలూర్‌ ప్రాంతానికి చేరుకుంది. అక్కడి ఓ స్వచ్ఛంద సంస్థ చేరదీసి చికిత్స చేయించింది. ఇటీవల ఆమె కోలుకుని సాధారణ స్థితికి రావడంతో ఆ సంస్థ ప్రతినిధులు వివరాలు అడిగి తెలుసుకుని కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. వారు అక్కడికి వెళ్లి లక్ష్మిని సోమవారం రాత్రి ఇంటికి తీసుకొచ్చారు. చనిపోయిందనుకున్న ఆమె తిరిగి ఇంటికి చేరడంతో భర్త, కుమార్తెలు, ఇతర బంధువులు సంతోషం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని