Nagaland: మిలిటెంట్ల ఏరివేత ఆపరేషన్‌ గురితప్పి.. 13 మంది మృతి

నాగాలాండ్‌లోని మోన్‌ జిల్లా ఓటింగ్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Updated : 05 Dec 2021 11:54 IST

మోన్‌: నాగాలాండ్‌లోని మోన్‌ జిల్లా ఓటింగ్‌ అనే ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శనివారం సాయంత్రం భద్రతాబలగాలు మిలిటెంట్లుగా భావించి పౌరులపై కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో 13 మంది మృతి చెందగా.. మరో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

అసలేం జరిగింది..?

తిరు బొగ్గు గని నుంచి ఒటింగ్ గ్రామం మధ్యలో ‘నేషనల్‌ సోషలిస్ట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ నాగాలాండ్‌’ మిలిటెంట్‌ గ్రూప్‌ సభ్యుల కదలికలు ఉన్నట్లు భద్రతా దళాలకు ఇంటెలిజెన్స్‌ సమాచారం అందింది. దీంతో భద్రతా దళాలు ఆపరేషన్‌ చేపట్టాయి. అక్కడి కార్మికులు ఆదివారం కుటుంబాలతో గడిపేందుకు  శనివారం సాయంత్రం బొగ్గుగనుల నుంచి బయల్దేరతారు. అదే విధంగా డిసెంబర్‌ 4వ తేదీన సాయంత్రం సమయంలో బొగ్గు గనిలో పనులు ముగించుకొని కొందరు కార్మికులు పికప్‌ ట్రక్‌పై ఇళ్లకు బయల్దేరారు. అదే సమయంలో గాలింపు చేపట్టిన భద్రతా దళాలు వీరిని మిలిటెంట్లుగా అనుమానించి కాల్పులు జరిపాయి. శనివారం సాయంత్రమే ఆరుగురు చనిపోయారు.

తమ వారు ఎంతకీ ఇంటికి రాకపోవడంతో ఓటింగ్‌ గ్రామం నుంచి కొందరు గాలించేందుకు వెళ్లారు. వారికి మృతదేహాలు కనిపించాయి.  దీనిపై ఆగ్రహించిన స్థానికులు భద్రతా బలగాల వాహనాలను దహనం చేశారు. ఆదివారం ఉదయానికి మృతుల సంఖ్య 13కు పెరిగింది. మరో 11 మంది గాయపడగా.. ఇద్దరి ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది. మృతదేహాలను పోస్టుమార్టం కోసం జిల్లా ప్రధాన నగరం మోన్‌కు తరలించారు. మరోవైపు ఈ ఘటనపై నాగాలాండ్‌ ముఖ్యమంత్రి నెయ్‌ప్యూ రియో ఈ ఘటనపై స్పందించారు. ఓటింగ్‌ అనే ప్రదేశం వద్ద జరిగిన కాల్పుల్లో పౌరుల మృతిచెందడం దురదృష్టకరమన్నారు. దీనిపై సిట్‌ దర్యాప్తునకు ఆదేశించినట్లు చెప్పారు. అస్సాంలోని నాగోన్‌ లోక్‌సభ సభ్యుడు ప్రద్యుత్‌ బోర్డ్‌లోయ్‌ ఈ ఘటనకు సంబంధించిన చిత్రాలను ట్వీట్‌ చేశారు. 

నమ్మకమైన సమాచారంతోనే ఆపరేషన్‌ : అస్సాం రైఫిల్స్‌

ఆర్మీ 3 కోర్‌ ఈ ఘటనపై అధికారిక ప్రకటన విడుదల చేసింది. నమ్మకమైన సమాచారం లభించడంతోనే తాము ఆపరేషన్‌ చేపట్టినట్లు వెల్లడించింది. పౌరులు ప్రాణాలు కోల్పోవడంపై తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈ ఘటనకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి విచారణ చేపట్టి బాధ్యులను చట్ట ప్రకారం శిక్షిస్తామని పేర్కొంది. ఈ ఘటన అనంతర పరిణామాల్లో ఒక జవాను మృతి చెందగా.. మరికొందరు గాయపడ్డారని పేర్కొంది.

ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ట్విటర్‌లో స్పందించారు.‘‘మోన్‌ జిల్లా ఒటింగ్‌ వద్ద జరిగిన ఘటన తీవ్ర వేదనకు గురిచేసింది. మృతులకు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నాను. బాధిత కుటుంబాలకు న్యాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అత్యున్నత స్థాయి సిట్‌ ఈ ఘటనపై దర్యాప్తు చేపడుతుంది’’ అని పేర్కొన్నారు. మేఘాలయ ముఖ్యమంత్రి కన్రాడ్‌ సంగ్మా కూడా ఒటింగ్‌ ఘటనపై స్పందిస్తూ.. మృతులకు సంతాపం తెలియజేశారు. గాయపడినవారు వేగంగా కోలుకోవాలని ప్రార్థించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు