Crime News: నాటు వైద్యం చేయిస్తానని.. 13ఏళ్ల బాలికతో బలవంతంగా వ్యభిచారం

కరోనాతో బాధపడుతున్న మైనర్‌ బాలికకు నాటు వైద్యం చేయిస్తామని మాయమాటలు చెప్పి.. బాలికతో వ్యభిచారం చేయించిన ముఠాను గుంటూరు అర్బన్‌ పోలీసులు అరెస్టు

Published : 26 Dec 2021 01:24 IST

గుంటూరు: కరోనాతో బాధపడుతున్న మైనర్‌ బాలికకు నాటు వైద్యం చేయిస్తామని మాయమాటలు చెప్పి.. బాలికతో వ్యభిచారం చేయించిన ముఠాను గుంటూరు అర్బన్‌ పోలీసులు అరెస్టు  చేశారు. ఈకేసులో మొత్తం 23 మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 12 సెల్‌ఫోన్లు, బంగారు ఆభరణాలు, కారు, ప్రామిసరీ నోట్లు, రూ.వెయ్యి నగదు స్వాధీనం చేసుకున్నట్టు గుంటూరు అర్బన్‌ ఎస్పీ ఆరీఫ్‌ హఫీజ్‌ తెలిపారు. 

వివరాల్లోకి వెళితే... పల్నాడు ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి తన భార్య, కూతురికి కరోనా సోకడంతో గుంటూరు జీజీహెచ్‌లో చేర్పించగా భార్య చికిత్స పొందుతూ ఈ ఏడాది జూన్‌లో చనిపోయింది. పల్నాడులోని ఓ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న ఆ బాలికకు 13 ఏళ్లు. బాలికకు తండ్రి తప్ప మరెవరు లేరు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన ఓ మహిళ నాటువైద్యం చేయిస్తానని తండ్రిని నమ్మించి బాలికను ఆమె వెంట తీసుకెళ్లింది. ఆ తర్వాత వ్యభిచారం చేయాలని ఒత్తిడి తెచ్చింది. ఆ పనిచేయడం ఇష్టం లేదని చెప్పిన బాలికను ఇంట్లో బంధించి బయటకు రానీయకుండా కొన్నాళ్లు గుంటూరులో ఆ తర్వాత ఒంగోలు, నెల్లూరు, విజయవాడ, హైదరాబాద్‌ తీసుకెళ్లి వ్యభిచారం చేయించారు. 

నెల్లూరులో వారి చెర నుంచి తప్పించుకుని పారిపోయి విజయవాడ వచ్చిన బాలికను మరో ముఠా అదుపులోకి తీసుకుని బలవంతంగా తిరిగి వ్యభిచారం చేయించారు. బాలిక.. తండ్రికి ఫోన్‌ చేసి జరిగిన విషయం చెప్పడంతో.. తండ్రి మేడికొండూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి బాలిక ఆచూకి తెలుసుకున్నారు. అదుపులోకి తీసుకున్న 23 మందిలో మొత్తం 10మంది ఆర్గనైజర్స్‌ ఉన్నట్టు ఎస్పీ వివరించారు. ఈకేసులో మరికొందరి పాత్ర కూడా ఉందని, త్వరలో వారిని కూడా అరెస్టు చేస్తామని ఎస్పీ చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని