TS News: మాల్‌ 008 యాప్‌.. లాభం అంటూ అసలుకు ఎసరు! 

రుణయాప్‌ల పేరుతో భారీగా వడ్డీలు వసూలు చేసిన చైనీయులు మరో మోసానికి తెగబడ్డారు. తమ కంపెనీల్లో పెట్టుబడి పెడితే భారీగా లాభాలు వస్తాయంటూ అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. ఓ బాధితురాలి ఫిర్యాదుతో మాయగాళ్ల ...

Updated : 09 Aug 2021 07:30 IST

 ఓ మహిళ ఫిర్యాదుతో వెలుగులోకి మోసం.. ఇద్దరి అరెస్టు
ఈ వ్యవహారం వెనుకా చైనీయుల పాత్ర

ఈనాడు, హైదరాబాద్‌: రుణయాప్‌ల పేరుతో భారీగా వడ్డీలు వసూలు చేసిన చైనీయులు మరో మోసానికి తెగబడ్డారు. తమ కంపెనీల్లో పెట్టుబడి పెడితే భారీగా లాభాలు వస్తాయంటూ అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. ఓ బాధితురాలి ఫిర్యాదుతో మాయగాళ్ల గుట్టు బట్టబయలైంది. ఆ వివరాలు.. శ్రీనగర్‌ కాలనీకి చెందిన అడబాల శ్రీనివాసరావు, నల్లకుంటకు చెందిన నరాల విజయ్‌కృష్ణ ప్రైవేటు ఉద్యోగులు. గతనెలలో వీరికి ఇద్దరు చైనీయులు పరిచయమయ్యారు. అదనపు ఆదాయం వస్తుందంటూ మాల్‌008 పేరుతో నకిలీ సంస్థలను ప్రారంభించి ఆ ఇద్దరినీ డైరెక్టర్లుగా మార్చారు. ప్రతి నెలా ఒక్కొకరికి రూ.15,000 ఇస్తామంటూ ఆశచూపారు. ఆపై గూగుల్‌ ప్లే స్టోర్‌లో మాల్‌ 008 పేరిట యాప్‌ ఉంచారు. రూ.లక్ష పెట్టుబడితో రోజూ రూ.5,000 లాభం వస్తుందని, గృహిణులు ఇంటి నుంచే ఉద్యోగం చేస్తూ కమీషన్‌ పొందవచ్చంటూ ప్రకటనలు ఇచ్చారు. దీన్ని నమ్మిన బేగంపేటకు చెందిన ఓ మహిళ ఈ-కామర్స్‌ వెబ్‌సైట్ల ద్వారా లావాదేవీలు నిర్వహించారు. కమీషన్‌గా కొంత నగదు తన ఖాతాలోకి చేరటంతో ఆమెకు నమ్మకం కుదిరింది. ఆపై రూ.2.5లక్షలు పెట్టుబడి పెట్టారు. చివరకు మోసపోయినట్టు గ్రహించిన ఆమె హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీఎస్‌ సంయుక్త కమిషనర్‌ అవినాష్‌ మహంతి సారథ్యంలో సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కె.వి.ఎం.ప్రసాద్‌, ఇన్‌స్పెక్టర్‌ కె.హరిభూషణ్‌రావు బృందం దర్యాప్తు చేపట్టింది. సుమారు రూ.15 కోట్ల లావాదేవీలను నిర్వహించినట్లు గుర్తించింది. యాప్‌ వెనుక సూత్రధారులను గుర్తించేందుకు పోలీసులు.. తాము పెద్దమొత్తంలో వ్యాపారం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు వారికి నమ్మకం కలిగించారు. భారీగా డబ్బు వస్తుందనే ఆశతో నిందితులు అడబాల శ్రీనివాసరావు(45), నరాల విజయ్‌కృష్ణ(37) పోలీసులకు చిక్కారు. వారిని శనివారం అదుపులోకి తీసుకుని ప్రశ్నించటంతో బోగస్‌ సంస్థల బండారం వెలుగుచూసింది. వారిద్దరిని ఆదివారం అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి డెబిట్‌కార్డులు స్వాధీనం చేసుకున్నారు. వారి బ్యాంకు ఖాతాల్లోని రూ.19లక్షలను స్తంభింపజేశారు. యాప్‌ను ప్రారంభించిన చైనీయులు ఎవరనే కోణంలో పోలీసులు సమాచారం సేకరిస్తున్నట్టు తెలిసింది.

దిల్లీలో 5 లక్షల మందికి బురిడీ

ఈ ఏడాది జూన్‌లో దిల్లీలోనూ చైనాకు చెందిన సంస్థ ఇదే తరహాలో పెట్టుబడుల పేరుతో 5లక్షల మందిని మోసగించినట్టు కేసు నమోదైంది. ఆ వ్యవహారంలో పోలీసులు 11 మంది నిందితులను అరెస్ట్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని