TS News: యాదాద్రికి వెళ్లిన దివ్యాంగుడి మృతి

కుమార్తె పుట్టిందని తలనీలాలను సమర్పించడానికి యాదాద్రి క్షేత్రానికి వెళ్లిన ఓ దివ్యాంగుడు మరుసటి రోజు ఛాతీలో, కడుపులో నొప్పి అంటూ ఆసుపత్రిలో చేరి హైదరాబాద్‌లో మృతి చెందారు. పుణ్య క్షేత్రం వద్ద సెక్యూరిటీ సిబ్బంది కొట్టిన దెబ్బల వల్లే తన కుమారుడు మృతి

Updated : 20 Oct 2021 08:19 IST

భద్రతా సిబ్బంది కొట్టడం వల్లేనని తండ్రి ఫిర్యాదు

యాదగిరిగుట్ట పట్టణం, పాలమూరు, న్యూస్‌టుడే: కుమార్తె పుట్టిందని తలనీలాలను సమర్పించడానికి యాదాద్రి క్షేత్రానికి వెళ్లిన ఓ దివ్యాంగుడు మరుసటి రోజు ఛాతీలో, కడుపులో నొప్పి అంటూ ఆసుపత్రిలో చేరి హైదరాబాద్‌లో మృతి చెందారు. పుణ్య క్షేత్రం వద్ద సెక్యూరిటీ సిబ్బంది కొట్టిన దెబ్బల వల్లే తన కుమారుడు మృతి చెందినట్లు తండ్రి నారాయణగౌడ్‌ మంగళవారం మహబూబ్‌నగర్‌ రూరల్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ‘‘మామూలుగా చనిపోయాడని అనుకున్నాం. కాల్‌ రికార్డు విన్నాక యాదాద్రి సెక్యూరిటీ పోలీసులు కొట్టిన దెబ్బలే మరణానికి కారణమని అనుమానిస్తున్నాం’’ అని తెలిపారు. మహబూబ్‌నగర్‌ శ్రీనివాస కాలనీకి చెందిన కార్తీక్‌ గౌడ్‌ (32) దివ్యాంగుడు. ఎడమకాలికి పుట్టుకతోనే అవస్థ ఉంది. అటవీశాఖ పరిధిలోని మయూరీ నర్సరీలో తాత్కాలిక పద్ధతిపై టికెట్‌ కౌంటర్‌లో నాలుగేళ్ల నుంచి విధులు నిర్వహిస్తున్నారు. 15 రోజుల క్రితం ఆయన భార్య తొలి కాన్పులో ఆడపిల్లకు జన్మనిచ్చింది. మొక్కు ఉండటంతో ఆదివారం సాయంత్రం ఆయన ఒక్కరే యాదాద్రికి వెళ్లారు. వెళ్లేసరికి అర్ధరాత్రి అయింది. గదుల కోసం మొదటి ఘాట్‌రోడ్డు వద్ద తిరుగుతుండగా భద్రతా సిబ్బంది కొడుతున్నారని జడ్చర్లలోని తన బంధువు ఒకరికి ఫోన్‌ చేశారు.

సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు చేస్తా

రికార్డయిన సంభాషణల ప్రకారం.. ‘మామూలుగా వెళ్తున్న నన్ను పిలిచి కొట్టారు. నేను దివ్యాంగుడిని.. పరిగెత్తలేను అన్నా విన్లేదు. అటవీశాఖలో పనిచేస్తున్నానని ఆధారం చూపించగా ‘మాకు చూపిస్తావా’ అని కర్రతో ఇంకా కొట్టారు. వారి పక్కనే మద్యం సీసాలున్నాయి. కొట్టడానికి వారికి హక్కు ఎవరిచ్చారు? సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు చేస్తా’’ అని కార్తీక్‌ ఆవేదన వ్యక్తంచేశారు. బంధువు వెంటనే పోలీసులకు ఫోన్‌ చేసి విషయం చెప్పారు. ‘‘సమాచారం తెలిసి గొడవ జరుగుతున్నప్పుడే అక్కడికి వెళ్లాం. వాగ్వాదాన్ని ఆపి అక్కడి నుంచి కార్తీక్‌ను పంపించాం’’ అని యాదగిరిగుట్ట పట్టణ పోలీస్‌స్టేషన్‌ ఎస్సై-1 రామకృష్ణారెడ్డి తెలిపారు.

బస్టాండులో ఛాతీలో నొప్పితో విలవిల

సోమవారం ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్‌ బస్టాండు నుంచి బంధువులకు ఫోన్‌ చేసిన కార్తీక్‌.. తలనీలాలను సమర్పించి తిరిగి ఇంటికి బయల్దేరానని, కడుపు, ఛాతీలో బాగా నొప్పి వస్తోందని చెప్పారు. వారి సూచనతో ఉస్మానియా ఆసుపత్రికి వెళ్లిన ఆయన అక్కడ 12.50 గంటలకు మృతి చెందారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు మహబూబ్‌నగర్‌ గ్రామీణ ఠాణా ఎస్సై రమేశ్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని