
AP News: అనుమానాస్పద స్థితిలో మహిళా సీఏ మృతి
ప్రేమికుడే చంపాడని తల్లిదండ్రుల ఆరోపణ
విజయవాడ (గుణదల), న్యూస్‌టుడే: ఓ మహిళా ఛార్టర్డ్ అకౌంటెంట్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన విజయవాడలో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం రాజుపాలేనికి చెందిన చెరుకూరి సింధు (29) సీఏ పూర్తి చేసి ఒక ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. కొంతకాలం కిందట విజయవాడ సమీపంలోని పోరంకికి చెందిన కె.ప్రసేన్‌తో (అభి) ఆమెకు పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. వీరి వివాహానికి ఇరు కుటుంబాలవారు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో గతేడాది లాక్‌డౌన్ నుంచి సింధు గంగిరెద్దుల దిబ్బలోని ప్రసేన్ కుటుంబానికి చెందిన మరో ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారు. రెండు రోజుల నుంచి సింధుకు ఆమె తల్లి ఫోన్ చేస్తుండగా స్విచ్ఛాప్ వస్తోంది. దీంతో ఆమె ప్రసేన్‌కు ఫోన్ చేసి విషయం చెప్పారు. అతడు సింధు ఉంటున్న ఇంటి వద్దకు వచ్చి తలుపు తట్టగా ఎంతసేపటికీ తీయలేదు. అనుమానం వచ్చి కిటికీలోంచి చూడగా గదిలో గాయాలతో సింధు విగతజీవిగా కనిపించారు. వెంటనే ఆమె తల్లికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. తల్లిదండ్రులు హుటాహుటిన అక్కడికి వచ్చి మాచవరం పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలి తండ్రి వెంకటేశ్వరరావు ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
నమ్మించి హత్య చేశారు: తమ కుమార్తెను పెళ్లి చేసుకుంటానని చెప్పి ప్రసేన్ మోసం చేశాడని సింధు తల్లిదండ్రులు ఆరోపించారు. కుటుంబ సభ్యులతో కలిసి అతడే సింధును హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని వాపోయారు. దీనిపై నగర ఇన్‌ఛార్జి పోలీస్ కమిషనరు పాలరాజును కలిసి ఫిర్యాదు చేశామని తెలిపారు.
Advertisement