Updated : 02 Dec 2021 07:12 IST

Suicide: ‘తమ్ముడా నేనెళ్లిపోతున్నా’

  పంట అమ్ముకోలేక.. చేతిలో చిల్లిగవ్వ లేక..

ధాన్యం కుప్ప వద్ద పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య

కుమార్‌

ఏటూరునాగారం, న్యూస్‌టుడే: ఆరు ఎకరాల్లో కోసిన ధాన్యం అమ్ముడుపోలేదు.. మరో రెండు ఎకరాల వరి పొలాన్ని కోయడానికి చేతిలో చిల్లిగవ్వ లేదు.. మరోవైపు వేధిస్తున్న పాత బాకీలు.. ఈ పరిస్థితిలో ఏం చేయాలో.. ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఓ అన్నదాత తన ధాన్యం కుప్ప వద్దే బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషాద ఘటన ములుగు జిల్లాలో చోటుచేసుకుంది. ప్రభుత్వం సకాలంలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించి ఉంటే ఈ రైతు తన నిండు ప్రాణం తీసుకునేవారు కాదని తోటి రైతులు విచారం వ్యక్తం చేశారు. ఏటూరునాగారం మండలంలోని శివాపురానికి చెందిన బేతెల్లి కుమార్‌(45) మంగళవారం రాత్రి తన ఇంటి సమీపంలోని పొలంలో ఉంచిన తన వరి ధాన్యం కుప్పపై కూర్చుని గడ్డిమందు తాగారు. మంగపేట మండలం తొండ్యాలలో ఉన్న తన చిన్న తమ్ముడు మల్లేష్‌కు పోన్‌ చేసి.. ‘తమ్ముడా నేనెళ్లిపోతున్నా’ అంటూ విషయం చెప్పాడు. దీంతో కుటుంబసభ్యులు ఘటనా స్థలానికి వెళ్లి కుప్పపై అపస్మారక స్థితిలో ఉన్న కుమార్‌ను ఏటూరునాగారంలోని ప్రైవేటు ఆసుపత్రికి, తర్వాత వరంగల్‌లోని ఎంజీఎంకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం ఉదయం రైతు మృతి చెందాడు. ఆయనకు భార్య రాణి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

ఒక్క గింజా కొనలేదు..

ఈ గ్రామంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినా ఇప్పటివరకు గింజ ధాన్యం కొనలేదు. కుమార్‌ సాగు చేసిన 8 ఎకరాల పొలంలో 6 ఎకరాలు పంట కోయగా కనీసం వంద బస్తాల దిగుబడి కూడా రాలేదు. మరో రెండు ఎకరాల పైరు నేల వాలి గింజ రాలిపోతోంది. ఈ పంట కోసేందుకు చేతిలో డబ్బులు లేవు. కోత మిషన్‌ వారికీ పాత బకాయి ఉండడం, బయట అప్పు దొరక్క పోవడంతో ఆవేదనకు గురయ్యాడు. అదే 11 రోజుల కింద కోత కోసిన ధాన్యం అమ్ముడుపోయి ఉంటే మిగతా రెండు ఎకరాల పంటనూ కోత కోసి అమ్ముకునే వాడని, ఆత్మహత్యకు పాల్పడాల్సిన పరిస్థితి వచ్చేది కాదని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. అయిదేళ్లుగా వస్తున్న వరుస పంట నష్టాలతో వడ్డీలతో కలిపి కుమార్‌ రూ.10 లక్షల మేర అప్పుల పాలయ్యాడని బంధువులు, గ్రామస్థులు తెలిపారు. ఏటూరునాగారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని