Maoist: మావోయిస్టు కీలక నేత దుబాసి శంకర్‌ అరెస్టు

ఏవోబీలోని కొరాపుట్‌, మల్కాన్‌గిరి, విశాఖపట్నం జిల్లాల్లో మావోయిస్టు కీలకనేత దుబాసి శంకర్‌ అలియాస్‌ మహేందర్‌ అలియాస్‌ అరుణ్‌ అలియాస్‌ రమేష్‌ను ఒడిశాలో సోమవారం అరెస్టు చేసినట్లు ఆ రాష్ట్ర డీజీపీ అభయ్‌ తెలిపారు. ఆయన మంగళవారం ...

Updated : 15 Sep 2021 15:52 IST

మూడు రాష్ట్రాల్లో పలు కేసులు.. 20 లక్షల రివార్డు

ఈనాడు-అమరావతి, న్యూస్‌టుడే-భువనేశ్వర్‌ అర్బన్‌, దౌల్తాబాద్‌: ఏవోబీలోని కొరాపుట్‌, మల్కాన్‌గిరి, విశాఖపట్నం జిల్లాల్లో మావోయిస్టు కీలకనేత దుబాసి శంకర్‌ అలియాస్‌ మహేందర్‌ అలియాస్‌ అరుణ్‌ అలియాస్‌ రమేష్‌ను ఒడిశాలో సోమవారం అరెస్టు చేసినట్లు ఆ రాష్ట్ర డీజీపీ అభయ్‌ తెలిపారు. ఆయన మంగళవారం భువనేశ్వర్‌లో విలేకర్లతో మాట్లాడారు. ‘కొరాపుట్‌ జిల్లా బొయిపరిగుడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పేటగడ అటవీ ప్రాంతంలో ఎస్‌వోజీ, జిల్లా వాలంటరీ దళం, బీఎస్‌ఎఫ్‌, రాష్ట్ర పోలీసులు కూంబింగ్‌ చేసి.. నోయరో గ్రామంలో శంకర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడివద్ద ఇన్సాస్‌ రైఫిల్‌, 10రౌండ్ల బుల్లెట్లు, ఇతర సామగ్రి, రూ.35,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. అతడి ఆచూకీ చెప్పినవారికి రూ.20 లక్షల బహుమతి ఇస్తామని గతంలో ప్రకటించాం’ అని ఒడిశా డీజీపీ అభయ్‌ తెలిపారు.

తీగలమెట్ట ఘటనతో సంబంధం..
తెలంగాణలోని సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్‌ మండలం చెట్లనర్సంపల్లికి చెందిన శంకర్‌ 1987 నుంచి తీవ్రవాద ఉద్యమంలో పాల్గొంటున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో అతని భార్య భారతక్క 2016లో మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్‌-ఒడిశా స్పెషల్‌ జోనల్‌ కమిటీ సభ్యుడిగా ఉన్నారని డీజీపీ తెలిపారు. ఈ ఏడాది విశాఖపట్నం జిల్లా తీగలమెట్టలో జరిగిన ఎదురుకాల్పుల్లో అతడి హస్తం ఉందన్నారు. 2010లో గోవిందపల్లిలో మందుపాతర పేలి 11 మంది ఒడిశా పోలీసులు, అనంతరం చిత్రకొండలోని జానిగుడలో జరిగిన కాల్పుల్లో నలుగురు బీఎస్‌ఎఫ్‌ జవాన్లు మరణించారని, ఆ ఘటనలతో అతడికి సంబంధం ఉందని తెలిపారు. శంకర్‌ దుబాసీ 1987లో పార్టీలో చేరి.. 2003 నాటికి ఎస్‌జడ్‌సీ సభ్యుడి స్థాయికి ఎదిగారు. అప్పటి నుంచి ఏవోబీలోనే పనిచేస్తున్నారు. ఒడిశాలోని మల్కన్‌గిరి, కొరాపూట్‌ జిల్లాల్లో 20, తెలంగాణ రాష్ట్ర పరిధిలో 24 కేసులు శంకర్‌పై ఉన్నాయి.

* ఒడిశా పోలీసులు కొరాపూట్‌ జిల్లాలో రెండు రోజుల క్రితం మావోయిస్టు నేతలు దుబాసీ శంకర్‌ అలియాస్‌ మహేందర్‌, కిరణ్‌ను అదుపులోకి తీసుకున్నారని వారిని వెంటనే విడిచిపెట్టాలని ఆంధ్రప్రదేశ్‌ పౌరహక్కుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి.చిట్టిబాబు, చిలుక చంద్రశేఖర్‌, తెలంగాణ పౌర హక్కుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గడ్డం లక్ష్మణ్‌, ఎన్‌.నారాయణరావు మంగళవారం ఒక ప్రకటనలో డిమాండు చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని