
Hyderabad News: ఎల్బీనగర్లో ప్రేమోన్మాది దాడి.. యువతిపై 18 చోట్ల కత్తిపోట్లు
నిందితుడు బస్వరాజు
ఈనాడు, హైదరాబాద్, నాగోలు, న్యూస్‌టుడే: తాను ప్రేమించిన యువతి మరో వ్యక్తిని పెళ్లాడుతుందనే కోపంతో ఆమెపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడో ఉన్మాది. ఈ ఘటన హైదరాబాద్ ఎల్బీనగర్ ఠాణా పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి విషమంగా ఉంది. వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి(20), అదే ప్రాంతం తిమ్మారెడ్డిపల్లికి చెందిన బస్వరాజు(23) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి వివాహానికి యువతి తల్లిదండ్రులు అంగీకరించలేదు. మరో వ్యక్తితో ఆమెకు నిశ్చితార్థం చేసి, నగర పరిధి హస్తినాపురంలోని బాబాయి ఇంట్లో ఉంచారు. సన్‌సిటీ సమీపంలోని రామ్‌దేవ్‌గూడలో ఉంటూ సెంట్రింగ్ పని చేస్తున్న బస్వరాజు.. విషయం తెలుసుకొని బుధవారం మధ్యాహ్నం అక్కడకు చేరుకున్నాడు. ఆమె ఒంటరిగా ఉన్నట్లు నిర్ధారించుకుని.. ఒక్కసారి మాట్లాడితే వెళ్లిపోతానంటూ మెసేజ్ పెట్టాడు. ఆమె బయటికొచ్చాక ఎక్కడికైనా వెళ్లి పెళ్లి చేసుకుందామనే ప్రతిపాదన తెచ్చాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో కత్తితో రాక్షసంగా దాడి చేసి పరారయ్యాడు. స్థానికులు బాధితురాలిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. యువతిని పరీక్షించిన వైద్యులు 18 చోట్ల కత్తిపోట్లు గుర్తించారు. ఛాతీ, ఊపిరితిత్తుల్లో బలమైన గాయాలైనట్లు తేల్చారు. 48 గంటలు గడిస్తే కానీ ఏం చెప్పలేమని స్పష్టం చేశారు. ఎల్బీనగర్ సీఐ అశోక్‌రెడ్డి.. నిందితుడు బస్వరాజును అదుపులోకి తీసుకుని, అతనిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.